శేరిలింగంపల్లి, నవంబర్ 5: గోపన్‌పల్లి సోఫాకాలనీలో ఓ ప్లాట్‌కు సంబంధించిన సివిల్ వివాదంలో గచ్చిబౌలికి చెందిన ఓ ఎస్ఐ తలదూర్చి ఏకపక్షంగా వ్యవహరించారంటూ కాలనీకి చెందిన నవాజ్ అనే వ్యక్తి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌కు ఫిర్యాదు చేశాడు. మంగళవారం నవాజ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు.
గోపన్‌పల్లి సర్వేనంబర్ 124/రు, సోఫాకాలనీ, ప్లాట్‌నంబర్ 25లో 200 గజాల స్థలాన్ని నానక్‌రాంగూడకు చెందిన మునావర్ పాషా నుంచి తాను కొనుగోలు చేసినట్టు తెలిపాడు. సదరు ప్లాట్ విక్రయ లావాదేవీలు గచ్చిబౌలి ఎస్ఐ మహేందర్‌రెడ్డి సమక్షంలో చేసుకున్నామన్నాడు. అందుకు అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు చెల్లించానని చెప్పాడు. మిగతా డబ్బును సమకూర్చడంలో కొంత జాప్యం జరగడంతో సదరు ప్లాట్‌ను గోపన్‌పల్లికి చెందిన మరొకరికి విక్రయించారని పేర్కొన్నాడు.
కాగా.. షేక్ షుకూర్ అనే వ్యక్తి గత 13 సంవత్సరాలుగా సదరు ప్లాట్‌లో పొజిషన్లో ఉండగా.. ఎస్ఐ మహేందర్‌రెడ్డి అతడిని భయభ్రాంతులకు గురిచేసి మునావర్ పాషాకు పొజిషన్ ఇప్పించారని తెలిపాడు. సదరు ప్లాట్ విషయంలో షుకూర్‌కు అన్యాయం చేశారని, ఇప్పుడు తనకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పాడు. ప్లాట్ పొజిషన్, అమ్మకం విషయంలో ఎస్ఐ కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ చేపట్టి వాస్తవాలను తెలియజేస్తామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ ఉల్లాఖాన్ తెలిపారు.