శేరిలింగంపల్లి, జనవరి 26 : శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్‌పల్లి రంగనాథ నగర్ కాలనీలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగనాథనగర్ ఇళ్ల స్థలాల యజమానుల సంఘం అధ్వర్యంలో ప్లాట్ల యజమానులు అక్కడ ఉన్న ఇనుప భారీకేడ్లను తొలగించి బలవంతంగా లోనికి చోచ్చుకొని వెళ్లి జాతీయ జెండాఎగురవేశారు. అనంతరం ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వివాదాస్పదంగా ఉన్న స్థలంలో భారీకేడ్లను తొలగించి అక్రమంగా ప్రవేశించడం సరికాదని లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకుండా తమ ఆందోళన ఉధ్రుతం చేశారు. లోపలికి ప్రవేశించి టెంట్ వేసుకొని ఆందోళన కొనసాగించారు.
గోపన్‌పల్లి రంగనాథనగర్ ఇళ్ల స్థలాల యజమానుల సంఘం అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ 1987లో గోపన్‌పల్లిలో రంగనాథనగర్ పేరిట ఎన్వీ రమణయ్య, పీఆర్ చౌదరి జీపీఏ చేసుకొని మొత్తం 19 ఎకరాల్లో 650 ప్లాట్లతో లేఅవుట్ వేసి విక్రయించారని తెలిపారు. 2005 తర్వాత అదే వ్యక్తులు తమకు విక్రయించారని కొందరు బడాబాబులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్థలం మాదంటు భారీకేడ్లు వేశారని తెలిపారు. 2021 అక్టోబర్ 30న దాదాపు 150 ప్లాట్లలో ఉన్న గదులను జేసీబీలతో కూల్చివేసి స్వాధీన పరుచుకున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమ స్థలాల కోసం పోరాటం చేస్తున్నామని, తిరిగి తమ ప్లాట్లను స్వాధీనం చేసుకోబోతున్నట్లు తెలిపారు.