సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, స్వాధీనం, నిధుల సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.15వేల కోట్ల రుణ ప్రక్రియలో ఒప్పందం కుదిరిన తర్వాత భంగపడిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా తెలిసింది. దీనికి కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం…ఇప్పుడు కొత్త రుణ సంస్థను వెదికే పనిలో ఉన్నట్లుగా తెలిసింది.
ఈ క్రమంలోనే ఐఆర్ఎఫ్సీ నిధుల కోసం గతంలో నియమించిన ఐడీబీఐ లాంటి మరో కన్సల్టెన్సీ సంస్థను నియమించుకునే పనుల్లో పడింది. ఐఆర్ఎఫ్ఎస్ రుణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏడాదిపాటు సమయంతోపాటు, లావాదేవీల నిర్వహణ, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో దాదాపు రూ.260 కోట్లను రాష్ట్ర సర్కార్ ఖర్చు చేసింది. అయితే కేంద్రం పెట్టిన కొర్రీలతో తలపట్టుకోవడం రాష్ట్ర సర్కార్ వంతైంది. స్వాధీన ప్రక్రియ విషయంలో కేంద్రం నియమించిన కమిటీ ఇప్పటికీ పని మొదలుపెట్టలేదు. ఆ తర్వాత విస్తరణ గురించి ఆలోచిస్తామంటూ చెబుతూ సిటీ మెట్రో వ్యవస్థలను ఇరు ప్రభుత్వాలు డోలాయామానంలో పడేశాయి.
అయితే కేంద్రం 2 నెలల్లో ఈ మొదటి దశ స్వాధీన ప్రక్రియను పూర్తిచేస్తామని చెబుతున్నా… క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిధులు ఇచ్చే కొత్త ఆర్థిక సంస్థను ఎంపిక చేయడం, షరతులపై చర్చించడం 2 నెలల వ్యవధిలో సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గతంలో ఒక్క ఐఆర్ఎఫ్సీ ఒప్పందానికే 6 నెలలకు పైగా సమయం పట్టిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ఎస్బీఐ క్యాప్స్ నివేదిక ఇచ్చినా.. నిధుల మంజూరుకు కనీసం మరో 6 నెలల సమయం పట్టనుంది.
సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.. కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసిన అనంతరం, మొదటి దశ పునర్ మూల్యాంకనం, రెండు దశలకు అవసరమైన నిధుల సేకరణ బాధ్యతలను ఎస్బీఐ క్యాప్స్‌కు కేంద్రం అప్పగించింది. అయితే నెలన్నర రోజులుగా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగాపరిస్థితి తయారైంది.జపాన్ దేశానికి చెందిన ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో… కొత్తగా అడ్వైజరీ నియామకానికి మరోసారి కసరత్తు మొదలుపెట్టింది. అదే తరహాలో తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు దేశీయ బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈమొత్తం రుణ సమీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగించేందుకు కొత్తగా మరొక ట్రాన్సాక్షన్ అడ్వైజరీ ఏజెన్సీని ఏర్పాటు చేసే యోచనలో హెచ్ఎంఆర్ఎల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.