Medchal | మేడ్చల్: మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయి. దీంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పన్నుల వసూళ్లను రాబట్టే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి 2024-25 వ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పన్నుల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి కుంటుపడవద్దంటే వసూళ్లు జరిగితేనే కొంత అయినా అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. రూ.184 కోట్ల బకాయిలు..
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 34 గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 184 కోట్ల పన్ను వసూళ్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే పన్నులు వసూళ్లు జరిగాయి. మున్సిపాలిటీల్లో రూ. 172 కోట్లు, గ్రామ పంచాయతీల్లో రూ. 10, 56 కోట్ల పన్నులను రాబట్టాల్సి ఉంది.
మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయపోగా, మేడ్చల్ జిల్లాలో ఇటీవలే 28 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు మరింత భారం పెరిగినట్లయింది. మున్సిపాలిటీలు నిధుల లేమితో ఇబ్బందులు పడుతుంటే..మరోవైపు విలీనం చేసిన గ్రామాలతో మున్సిపాలిటీ అధికారులు పెద్ద తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీల్లో విలీనం చేసిన క్రమంలో గ్రామాలకు చెందిన ప్రజలు విలీనం చేయవద్దని ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విలీనమైన గ్రామాల ప్రజలు తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.