సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన మెట్రో విస్తరణకు నిధుల కొరత వెంటాడుతోంది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ఫేజ్-2 పనులు పూర్తిచేస్తామని ప్రకటించినా.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జైకా లాంటి ఆర్థిక సంస్థలు చేసే సాయమే ప్రాజెక్ట్‌కు కీలకంగా మారనుంది. వివిధ ఆర్థిక సంస్థలు ఇచ్చే ఆర్థిక సాయంపైనే మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఆధారపడి ఉందని తెలుస్తోంది. అయితే కేంద్రానికి పంపిన ఫేజ్-2 డీపీఆర్ ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. దాదాపు మూడున్నర నెలలుగా డీపీఆర్ విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సూత్రప్రాయంగా కూడా ఆమోదించలేదు. ఒకవేళ కేంద్రం త్వరలో ఆమోదించినా నిధుల సర్దుబాటు ఎలా అనే అంశం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
ఆరు కారిడార్లలో..
మెట్రో ఫేజ్-2లో భాగంగా ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఆరో కారిడార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు, నార్త్ సిటీకి మరో 44 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. మిగిలిన 5 కారిడార్ల నిర్మాణానికి అవసరమైన నివేదికలపై కేంద్రంతో మెట్రో సంస్థ సంప్రదింపులు చేస్తోంది.
మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 48శాతం మేర జైకా, ఏడీబీ, ఎన్డీబీ(మల్టీ లెటరల్) వంటి ఆర్థిక సంస్థలతో ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మిగిలిన 7,313 కోట్లు(30శాతం) రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర వాటా రూ. 4230 కోట్లు(18శాతం) మేర చేపట్టనుంది. అయితే ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండగా, మిగిలిన 4శాతం మేర రూ.1,033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చి ప్రాజెక్టును చేపట్టేలా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును హైదరాబాద్ మెట్రో సంస్థ సిద్ధం చేసింది.
ఆర్థిక వనరులే కీలకం…
ఐదు కారిడార్లతోపాటు.. ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టులన్నింటికి కూడా ఆర్థిక వనరులే కీలకంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధులు కేటాయింపు ఆశలు తక్కువే ఉన్నా… ఆర్థిక సంస్థలు ప్రోత్సహిస్తే తప్పా… మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా నిధులను సర్దుబాటు చేస్తుందనే భరోసా లేకుండా పోయింది. అయితే కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించినా… నిధుల కేటాయింపులు అనుకున్నంత త్వరగా జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే నిధులపైనే మెట్రో విస్తరణ ఆధారపడి ఉంటుంది. దీని ఫలితంగా ప్రభుత్వం చెప్పిన డెడ్‌లైన్‌లోపు మెట్రో ఫేజ్-2 విస్తరణ పూర్తయ్యేనా అనే ప్రశ్నలు తలెత్తుఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఫేజ్-2 పై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.