సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) :ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులకు సిటీ సెంటర్‌గా నిలుస్తుంది. సిటీ చదువులు బహుళ ప్రయోజనాలుగా నిలుస్తున్నాయి. ఉన్నత చదువులతో పాటు ఉద్యోగం, ఉపాధి దొరుకుతుంది. కోర్సులకు అనుబంధంగా సాఫ్ట్వేర్ ప్యాకేజీలు నేర్చుకోవడానికి తగిన ఐటీ శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు వీడి, పట్టణాలలో చదువుకోవడం వల్ల యువత భవిష్యత్‌కు కావాల్సిన నైపుణ్యాలు దొరుకుతున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, స్విగ్గీ, జుమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆన్లైన్ షాపింగ్ డెలివరీ బాయ్స్ వంటి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరానికి (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్) చెందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ఫుల్ డిమాండ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 187 కాలేజీలు ఉండగా.. వాటిలో 60 శాతం కాలేజీలు ఇక్కడే ఉన్నాయి. సిటీలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలోనే నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని, ఈ కాలేజీలలో చదివితేనే ప్లేస్మెంట్ ఉంటుందన్న ఆలోచనతో యువత నగర కాలేజీల వైపు పరుగులు పెడుతున్నారు. అందువల్లే నగర పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో దాదాపు 90 శాతానికి పైగా సీట్లు నిండుతున్నాయని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు ఆఫీసర్ బి శ్రీనివాస్ ధ్రువీకరించారు. అందుకే కన్వీనర్ కోటాలో పాటు యాజమాన్య కోటాలో వంద శాతం సీట్లు భర్తీ కాగా కన్వీనర్ కోటాలో మాత్రం 90 శాతం వరకు సీట్లు నిండుతున్నాయి. నాణ్యమైన విద్య, బెస్ట్ ప్లేస్మెంట్, బెస్ట్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, బెస్ట్ రీసెర్చ్ ల్యాబులు, కంప్యూటర్ ల్యాబులు ఉన్న కాలేజీలకు అధిక మొత్తంలో ట్యూషన్ ఫీజులు, క్యాపిటేషన్ ఫీజులు చెల్లించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. కొన్ని కాలేజీలలో మహిళల కోసం కాలేజీ అనుబంధ హాస్టళ్లు నడుస్తున్నాయి. నగర కాలేజీలలో సీట్లు నిండడానికి ఇలాంటి వసతి సదుపాయాలు కూడా కారణాలవుతున్నాయి.
పార్ట్ టైమ్ ఉద్యోగాలు..
నగరంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థినీ, విద్యార్ధులు బహుళ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఒక పక్క ఇంజినీరింగ్ కాలేజీలలో రెగ్యులర్ విధానంలో చదువుతూనే.. మరో పక్క పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా కోర్సులకు తగిన విధంగా కంప్యూటర్ ప్యాకేజీలు నేర్చుకోవడానికి హైదరాబాద్ ఒక్కటే వేదికగా మారింది. కోర్సులతో పాటు సకాలంలోనే విద్యార్థులు కంప్యూటర్ ప్యాకేజీలు పూర్తి చేసుకుని, బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తి కాకుండానే మైక్రోసాఫ్ట్, గూగుల్, విప్రో వంటి ఐటీ కంపెనీలలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు పొందుతుండటం విశేషం.