సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ చౌరస్తాలో రిక్షా ర్యాలీ జరిగింది. పెరిగిన ధరలతో ఆటో నడపడం భారంగా మారిందని..ఇక మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా రిక్షా నడుపుకునే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆటో డ్రైవర్లు విమర్శించారు. సీఎం, పీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నాయని విమర్శించారు.
బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 7, సీఎన్జీపై 6 రూపాయలు పెంచి కేంద్రం చోద్యం చూస్తున్నదన్నారు. దఫదఫాలుగా పెంచుతూ కేంద్రం తమ ఉపాధిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంధన ధరలు భారం కాకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్లకు తీరని నష్టం జరిగిందన్నారు. ఉచిత బస్సు తీసుకొచ్చి ఉపాధి లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తానని ఇప్పటికీ అది అమలు చేయలేదని విమర్శించారు. డ్రైవర్ల సంక్షేమ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక భద్రత కింద ఆటో డ్రైవర్లు మరణిస్తే వర్తించే రూ.5 లక్షల ప్రమాదబీమా కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలు భారం కాకుండా వ్యాట్ తగ్గించే చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తే మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని మారయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాప్రా డిజివన్ అధ్యక్షుడు కర్నే రామాంజనేయులు, పాలపల్లి రమేష్, గోపాల్ నాయక్, శ్రీనివాసన్, ఉడుగుల రమేష్, అనిల్, హన్మంతు, అరవింద్, సురేశ్, బాలరాజు, కృష్ణ, క్రాంతిమ, మల్లేష్, సాయికిరణ్, యాదగిరి, నాగశ్రీను, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.