e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు

సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు

సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు
  • నగరంలో లీటరు పెట్రోలు రూ.100.20, డీజిల్‌ 95.14
  • రికార్డు స్థాయికి చేరిన చమురు ధరలు
  • నెలన్నరలో సుమారు 25 సార్లు పెంపు
  • కరోనా కష్టకాలంలో ఇవేం ధరలని జనాగ్రహం

ఇంధన ధరలు సామాన్యులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూనే ఉన్నాయి. అసలే కరోనా కాలంలో కష్టాలు పడుతున్న జనానికి పెనుభారంగా మారుతున్నాయి. తాజాగా సిటీలో పెట్రోలు సెంచరీ కొట్టేసింది. డీజిల్‌ రేటు కూడా ఆ దిశగా పయనిస్తున్నది. ఒకటీ.. రెండు సార్లు కాదు… నెలన్నరలో దాదాపు 25 సార్లు ధరలు పెంచడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. సోమవారం కూడా పెట్రోలు 29 పైసలు పెరిగి… లీటరుకు 100.20 చేరుకుంటే..డీజిల్‌ సైతం మరో 30 పైసలు పెంచడంతో… లీటరుకు రూ.95.14 చేరింది. అసలే కొవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గి బాధపడుతుంటే.. చమురు ఉత్పత్తి సంస్థలు అదే పనిగా ఇంధన భారం మోపుతుండటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సగం జీతం పెట్రోల్‌ ఖర్చులకే..

ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జీతంలో సగం డబ్బులు పెట్రోల్‌ ఖర్చులకే పోతున్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చిన పార్సిళ్లను ఇంటింటికీ చేరవేయాల్సి ఉంటుంది. వచ్చే వేతనంలో అధిక మొత్తం పెట్రోల్‌కే వెచ్చించాల్సి వస్తున్నది. కేంద్రం సామాన్యుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ధరల తగ్గింపుపై ఆలోచించాలి.-భువన్‌ కుమార్‌, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌

- Advertisement -

నగరంలో పెట్రోలు లీటర్‌ ధర సెంచరీ దాటింది. వరుసగా పరుగులు పెడుతున్న చమురు ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకటి కాదు..రెండుసార్లు కాదు…గత నెలన్నరలో దాదాపు 25 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. తాజాగా సోమవారం కూడా పెట్రోలు ధర 29 పైసలు పెరిగి…లీటరు రూ.100.20 చేరింది. డీజిల్‌ మరో 30 పైసలు పెరిగి లీటరు రూ.95.14 చేరుకుంది. అసలే కరోనా సమయంలో ఆదాయం తగ్గి అతలాకుతలమవుతుంటే చమురు సంస్థలు అదేపనిగా ధరలు పెంచడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్‌ పరిధిలో 600 బంకులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 600కు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 6 లక్షల లీటర్లకు పైగా పెట్రోలు, దాదాపు 50 వేల లీటర్లకు పైగా డీజిల్‌ విక్రయాలు జరుగుతాయి. వ్యక్తిగత వాహనాలతోపాటు రవాణాలో చమురు చాలా కీలకం. కూరగాయలు మొదలు నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి తరలింపులో ఇదే ప్రధానం. చమురు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో వస్తువులు, కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ పరోక్షంగా ప్రభావాన్ని చూపుతాయి. నిత్యం లక్షలాది మంది నగరవాసులు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార కార్యకలాపాల కోసం వాహనాలు వినియోగిస్తారు. గ్రేటర్‌ పరిధిలో వాహనాల సంఖ్య కోటి పైమాటే. ఎన్నడూ లేనంతగా చమురు ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనదారులు, సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు ఎలా నడపాలి ? ఏం తిని బతకాలి ? అని గగ్గోలు పెడుతున్నారు. మే 4 తేదీ నుంచి మొదలైన చమురు ధరల పెంపు ఇంకా కొనసాగుతూనే ఉండటంపై మండిపడుతున్నారు.

మినీ సంగ్రామం తర్వాత బాదుడే…

ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 3 వరకు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. చమురు ధరలు పెరగకుండా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ సకల జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగినన్ని రోజులు చమురు ధరలు నయాపైసా పెరగలేదు కదా..పెట్రోలు 26 పైసలు తగ్గింది. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బాదడం ప్రారంభించారు. ఇలా పైసా పైసా పెరుగుతూ హైదరాబాద్‌లో పెట్రోలు సెంచరీ కొట్టగా…డీజిల్‌ సెంచరీకి చేరువలో ఉంది.

బండి తీయాలంటే భయమైతుంది..

పెట్రోలు ధర చూస్తుంటే బండి బయటకు తీయాలంటే భయమైతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్లపైకి వాహనాలు తెచ్చేందుకు ప్రజలు జంకుతారు. గతంలో ఇంత ధర ఎప్పుడు చూడలేదు. కేంద్ర ప్రభుత్వం చమురు ధరల నియంత్రణకు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. -మౌనిక, ప్రైవేట్‌ ఉద్యోగి, శేరిలింగంపల్లి

పెంచిన ధరలు తగ్గించాలి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా పెంచుతుండడంతో పేద,మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వంటింట్లో గ్యాస్‌ మొదలుకొని నిత్యావసరంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టానుసారం పెంచుతూ మోదీ ప్రభుత్వం నడ్డి విరుస్తున్నది. ప్రజలు ఎదురుతిరగకముందే ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. లేదంటే నిత్యావసర ధరల నియంత్రణపై ప్రజలు ఉద్యమం చేయాల్సి వస్తుంది. – దుర్గలక్ష్మీ, ఉద్యోగి

15 రోజుల్లోనే రూ.2 పెంపు

ఈ నెల 1వ తేదీ నుంచి దాదాపు ఎనిమిది సార్లు చమురు ధరలు పెరగ్గా..అందులో పెట్రోలు రూ.2 మేర పెరిగింది. జూన్‌ 1న లీటరు పెట్రోలు రూ.98.20, డీజిల్‌ 93.08 ఉంది. తాజా ధరతో పోలిస్తే కేవలం ఈ పక్షం రోజుల్లోనే పెట్రోలు ధర రెండు రూపాయలు పెరిగింది. డీజిల్‌ ధర రూ.2.06 మేర పెరిగింది. గత నెలన్నర రోజులుగా పరిశీలిస్తే…మే 3 న పెట్రోలు ధర రూ.93.99, డీజిల్‌ ధర 88.05 ఉంది. తాజా ధరలతో పోలిస్తే పెట్రోలు ఏకంగా రూ.6.29, డీజిల్‌ రూ.7.09 పెరిగి గుదిబండగా మారింది.

ఎలా బతకాలి

పెరుగుతున్న పెట్రో ధరలతో పేద,మధ్యతరగతి వారు అప్పులపాలయ్యే ప్రమాదం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధరలు ఆగడం లేదు. సామాన్యులు ఎలా బతకాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెంచేశారు. ఇప్పటికే కరోనా విజృంభిస్తుండడంతో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. -తాడూరి మహేష్‌, తిరుమలగిరి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు
సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు
సిటీలో సెంచరీ కొట్టేసిన పెట్రోలు

ట్రెండింగ్‌

Advertisement