సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)కు ఇంధన సెగ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన కొరత జనాలను వేధిస్తుండగా.. తాజాగా కార్పొరేషన్ సంస్థలకు తాకింది. రోజూ వారీగా కార్పొరేషన్లకు ఇచ్చే కూపన్లను పెట్రోల్ బంకు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే దోమల నివారణపై తీవ్ర ప్రభావం పడింది. గడిచిన రెండు రోజులుగా ఫాగింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రజలపై దోమలు దండెత్తుతున్నాయి.
ప్రధాన జోన్లలో యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ చర్యలు స్తంభించిపోగా.. దోమల తీవ్రత పెరిగి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దోమల నియంత్రణలో భాగంగా ఫాగింగ్‌కు డీజిల్‌లో మాలాథిన్ కెమికల్‌ను కలిపి స్ప్రే చేస్తారు. ఐతే మూడు కార్పొరేషన్ల పరిదిలో దాదాపు 300 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లు, సరిల్కు రెండు చొప్పున వెహికల్ మౌంటెడ్ మిషన్లతో ఫాగింగ్ చేస్తున్నారు. ఈ ఫాగింగ్‌కు సుమారు 3వేల నుంచి నాలుగు వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రభావం క్యూర్ పరిధి వాసులపై స్పష్టంగా కనిపిస్తోంది. పాతబస్తీలో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ జోన్‌తో పాటు, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి జోన్లో ప్రస్తుతం ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా 9 లీటర్ల డీజిల్ లో 2 లీటర్ల మాలాథిన్ కెమికల్ కలిపి ఫాగింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటికే సిబ్బంది మోతాదు తగ్గించి నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండగా..ఇప్పుడు ఏకంగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో యంత్రాలన్నీ షెడ్లకే పరిమితమయ్యాయి.
దీంతో ప్రస్తుత వేసవి కాలం కావడంతో డ్రైనేజీలు, నాలాల్లో దోమల ఉధృతి విపరీతంగా పెరిగింది. సాయంత్రం ఆరు దాటిందంటే చాలు నగరవాసులు తలుపులు వేసుకున్నా దోమల నుంచి ఉపశమనం లభించడం లేదు. ముఖ్యంగా మూసీ పరివాహాక బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫాగింగ్ సక్రమంగా జరగడం లేదని ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, ఇప్పుడు డీజిల్ సెగ తగలడం తోడైంది.
ఇంధన సరఫరా నిలిచిపోతే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బకాయిలు లేకుండా చూడడం, డీజిల్ సరఫరాను కొనసాగించాలని కోరుతూ చమురు సంస్థలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. నగర ఆరోగ్య దృష్ట్యా సహకరించాలని ఉన్నతాధికారులు రాయబారాలు నడిపేందుకు సంబందిత జోనల్ కమిషనర్లు సిద్ధమయ్యారు.