ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30 : నగరంలోని చైతన్యపురిలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శుక్రవారం నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారంలోని లాజిస్టిక్పార్కులో ప్రారంభించనున్నారు. ఇకనుంచి క్రయ విక్రయాలన్నీ ఇక్కడి నుంచే జరుగడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం రూ.90 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్లో నేటి నుంచి క్రయవిక్రయాలు జరుగనున్నాయి.
గడ్డిఅన్నారం మార్కెట్‌కు ఉదయం 8గంటల తరువాత వచ్చిన వాహనాలన్నీ రాత్రి 10గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ బాటసింగారం పండ్ల మార్కెట్ శివారులో ఉండటం వలన ఎలాంటి రవాణా ఆంక్షలు ఉండవు. బెంగళూరు, ముంబై, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఔటర్‌రింగ్‌రోడ్డు మీదుగా పెద్దఅంబర్‌పేట్ ఎగ్జిట్ వద్ద దిగి పండ్ల మార్కెట్‌కు చేరుకునే అవకాశముంటుంది.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : గడ్డిఅన్నారం మారెట్ను బాటసింగారంలో ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎంపిక చేసిన నోటిఫికేషన్ ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం తిరిగి విచారణ చేస్తామని, అప్పటి వరకు మారెట్ తరలింపునకు ఏవిధమైన చర్యలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి.వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. గడ్డిఅన్నారం మారెట్ తరలింపు చర్యలను సమర్థిస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హోల్‌సేల్ ఫ్రూట్ మారెట్ కమీషన్ ఏజెంట్లు, మరో ఇద్దరు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు.
22.05ఎకరాల్లోని రూ.1500కోట్ల విలువైన గడ్డిఅన్నారం మారెట్ను ప్రభుత్వానికి అప్పగించాలని మారెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జి.గంగయ్యనాయుడు వాదించారు. పభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, కోహెడ లో 178ఎకరాల్లో శాశ్వత ప్రాతిపదికపై మారెట్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
బాటసింగారంలో తాతాలికంగా ఏర్పాటు చేసేందుకు రూ.68లక్షలను మంజూరు చేసిందన్నారు. బాటసింగారంలో కోల్డ్ స్టోరేజీ, హమాలీలకు వసతులు కల్పించినట్లు చెప్పారు. గడ్డిఅన్నారం స్థలంలో రూ.250 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం నిర్మిస్తుందని, గడ్డిఅన్నారం మారెట్ను వేరే చోటకు అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నందున అప్పీల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.