కవాడిగూడ, ఏప్రిల్ 11 : ఈ నెల 13న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నట్లు మాల మాదిగ సంఘాల ఫ్రంట్ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఫ్రంట్ నేతలు రూపొందించిన జ్ఞాన యాత్ర ర్యాలీ పోస్టర్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, టీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీఎన్ రమేశ్ కుమార్ మాదిగ, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు రాంచందర్, జైబీమ్ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు పి. బల్వంత్ రావు, జాతీయ దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బుడ్ల బాబురావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు జ్ఞాన యాత్ర ర్యాలీ జరుగుతుందని వారు తెలిపారు.
ఈ యాత్రకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్‌సాగర్, గజ్జెల నాగేష్, బాలమల్లు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని వారు తెలిపారు. దళితులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ జ్ఞాన యాత్రను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షుడు మర్మాముల మల్లేశ్, రాష్ట్ర నాయకులు ఇటుక గోపీ, ఎం. లాజర్, నాగరాజు, బాలు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.