పహాడీషరీఫ్, నవంబర్ 13: పోలీస్ స్టేషన్లు అంటేనే భయానక కేంద్రాలు అనే భావన చాలా మంది ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నానుడిని చెరిపేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సరికొత్త విధానాలతో పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యారు. శాంతిభద్రతలే తమ విధి అని భావించకుండా సామాజిక కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొంటూ తమవంతు చేయూతనందిస్తున్నారు. ఠాణాల్లో ఉచిత ఉపాధిపై శిక్షణనిస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు. అందుకు నిదర్శనమే పహాడీ శరీప్ పోలీస్ స్టేషన్.
మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధిని పొందేందుకు రాచకొండ పోలీస్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు అండగా నిలుస్తున్నారు. తమ సొంతకాళ్లపై నిలబడి స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించడానికి ఉచిత కుట్టుమిషన్ శిక్షణను పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ కార్యాలయం ఆవరణలోని భరోసా సెంటర్లో ఏర్పాటు చేశారు.
శిక్షణను ఇవ్వడానికి మహిళను సైతం నియమించి రెండు బ్యాచ్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా కుట్టుమిషన్ శిక్షణ తీసుకుంటున్నామని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణతో మేలు
శిక్షణ తనకెంతో మేలు చేస్తున్నది. శిక్షణ తీసుకుంటున్న క్రమంలోనే బ్లౌజ్‌ని సొంతంగా కుడుతున్నాను. మొదట చిన్నవి, తర్వాత పెద్దవి పంజాబీ డ్రెస్ లాంటివి కుట్టడం నేర్చుకుంటున్నాను. మాలాంటి పేదలకు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది.
– మహముదా బేగం, జాబ్రి కాలనీ, షాహీన్‌నగర్
త్వరగా నేర్చుకునే విధంగా శిక్షణ..
కుట్టుమిషన్‌కు సంబంధించిన సామగ్రిని ఇస్తున్నాము. మొదట క్లాత్‌ను డ్రెస్స్‌కు తగినట్లు ఎలా కట్ చేయాలి. ఎలా కుట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. వారి వారి అభిరుచిని బట్టి నేర్పిస్తున్నాము.
– అమీనా బేగం, ట్రెయినర్, అల్ జబ్రీ కాలనీ
కుటుంబ పోషణకు ఆసరగా..
పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ కార్యాలయంలోని భరోసా సెంటర్లో ఇస్తున్న శిక్షణకు ఇంట్లో అనుమతి తీసుకున్నాను. కుటుంబ సభ్యులు అనుమతించారు. ఇక్కడ చక్కటి శిక్షణను ఇస్తున్నారు. కుటు ్టమిషన్ శిక్షణ తన కెంతో ఉపయోగపడుతున్నది.
– జ్యోతి, పహాడీషరీఫ్