సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా పీఎం విశ్వకర్మ పథకం తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ (కోవె) ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ స్కీంపై ఓరియేంటేషన్ సదస్సు నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఎంఎస్ఎంఈ, పలు చేతి వృత్తిదారులు, కోవె ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కుల వృత్తులు, చేతి వృత్తులను పరిరక్షించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్వ పథకం స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సాయపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి స్కీంలో పేర్కొన్న వృత్తులకు ప్రత్యేక శిక్షణతో నైపుణ్యాలను పెంపొందిస్తారని, శిక్షణ కాలానికి రోజుకు రూ.500 ైస్టెఫండ్, ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారని తెలిపారు. ఆధార్, ఆధార్ అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లోనే ఎంపిక పూర్తవుతుందన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదని, మధ్యవర్తులకు ఎలాంటి రసుం, ఫీజులు చెల్లించాల్సిన అవసరమే ఉండదన్నారు.
అదే విధంగా కామన్ సర్వీస్ సెంటర్లోనూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి మూడు దశల్లో శిక్షణ కార్యక్రమాలు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, సర్టిఫికేట్ వంటి అందజేస్తారని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకంలో పేర్కొన్న కులవృత్తులు మాత్రమే అర్హులనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సరైన వేదిక అవుతుందన్నారు. దరఖాస్తు విధానం, కావాల్సిన దరఖాస్తులు, ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుమతి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. 150కి మంది పైగా ఓరియేంటేషన్ సదస్సుకు హాజరు కాగా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు కోర్సు వివరాలు, స్కీం విధివిధానాలపై చేతి వృత్తిదారులకు సలహాలిచ్చారు. కులవృత్తులకు కేంద్రం అందిస్తున్న పథకం ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కో-వే తెలంగాణ చాఫ్టర్ ప్రెసిడెంట్ చేతన జైన్ అన్నారు. కార్యక్రమంలో జీఎం-డీఐసీ ప్రీతి పవన్ కుమార్, ఎంఎస్ఎంఈ అధికారులు శ్రీనివాసరావు, కోవె ఇండియా సలహాదారు కరుణా గోపాల్, కోవె వైస్ ప్రెసిడెంట్ కల్పనా రావు, సెక్రటరీ నీరజా గోదావర్తి, కోశాధికారి నిషా అగర్వాల్, జాయింట్ సెక్రటరీ అనూరాధ కారటీ, నాయీ బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ పిట్లంపల్లి రామలింగంచారి పాల్గొన్నారు.