సిటీ బ్యూరో, ఫిబ్రవరి21,(నమస్తే తెలంగాణ): వెన్‌కాబ్ చికెన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు నగరంలోని చింతలకుంట, కార్వాన్, కర్మన్‌ఘాట్, మోండా మార్కెట్, చిలుక నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో చికెన్, గుడ్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ పై ప్రజల్లో నెలకొన్న అనుమాలను కొట్టిపారేస్తూ వండిన చికెన్, కోడి గుడ్లను ప్రజలకు అందించేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా చనిపోతుందని వెల్లడించారు. అలాంటిది 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వండే చికెన్, గుడ్డులో ఎలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ ఉండే అవకాశం లేదన్నారు. ప్రజలు ఏవిధమైన అపోహలకు గురికాకుండా అత్యంత ప్రొటీన్స్ ఉండే గుడ్డు, చికెన్‌ను తినాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేళాలో పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.