సుల్తాన్ బజార్, జూన్ 23 : తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నమ్మించి మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర అటెన్షన్ డైవర్షన్ ముఠా నాయకుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.40లక్ష ల నగదును స్వాధీనం చేసుకోగా, మరో ఇద్దరు నిందితు లు పరారీలో ఉన్నారు. ఈ మేరకు సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి.. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నరసయ్య, సుల్తాన్‌బజార్ ఏసీపీ మట్టయ్య, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవి, డీఐ రవి కిరణ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లా, మాన్వి గ్రామానికి చెందిన జయ కుమార్ (50) రోప్ బిజినెస్ వ్యాపారం చేస్తుంటాడు. అదే జిల్లా ముద్గల్ ప్రాంతానికి చెందిన ఉదయ్ (35), సందీప్ (24)లతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. సగం ధరకు అసలు బంగారం ఇస్తామంటూ బాధితులను దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే జయకుమార్.. మార్చి 20న చౌటుప్పల్ భరత్‌నగర్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మునుకుంట్ల నిరంజన్‌కు ఫోన్ చేశాడు.
తన పేరు రెడ్డి అని.. అసలైన బంగారాన్ని సగం ధరకే అమ్ముతానంటూ నమ్మించాడు. తరచూ ఫోన్లు చేస్తుండడంతో నిరంజన్.. వ్యాపార భాగస్వామి, స్నేహితుడు ధర్మేందర్, సాయిలకు చెప్పాడు. ఈ ముగ్గురు.. పెద్ద అంబర్‌పేట్‌లో రెడ్డి, అతని సహచరుడు రఘుతో బంగారం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 12న ఉదయం 10.00 గంటలకు నగదుతో దిల్‌సుఖ్‌నగర్‌కు రావాలని రెడ్డి(జయకుమార్) కోరారు. దీంతో నిరంజన్ స్నేహితులతో కలిసి కారులో రూ.65 లక్షల నగదుతో అక్కడికి వచ్చారు. రెడ్డి గ్యాంగ్.. మధ్యాహ్నం 1:30 గంటకు వారిని పుత్లీబౌలి క్రాస్‌రోడ్ మీదుగా అఫ్జల్‌గంజ్‌కు తీసుకెళ్లారు.
పుత్లీబౌలిలోని ఇరానీ చాయ్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ దగ్గర రూ.65 లక్షలు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని, వారికి బంగా రం ఉన్న బ్యాగ్ ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిరంజన్.. బంగారం ఉన్న బ్యాగ్‌ను చూడగా అందులో రాళ్లతో చుట్టబడిన చీరలు ఉన్నాయి. వెంటనేవారు రెడ్డికు కాల్చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. దీంతో నిరంజన్ అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
సాంకేతిక, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులు జయ కుమార్, ఉదయ్, సందీప్‌లు కర్ణాటక, రాయచూర్ జిల్లాకు చెందినవారని గుర్తించారు. ఈ నెల 22న ఉదయం 10:30 గంటలకు ప్రధా న ముఠా నాయకుడు జయ కుమార్‌ను సీబీఎస్ సమీపంలో అరెస్టు చేసి, అతడి నుంచి రూ.40 లక్షల నగదు, క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఈ సమావేశంలో డీఎస్ఐ రామ్ కిషన్, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ యాసిన్ షరీఫ్, శ్రీకాంత్ బిడ్లా, పీసీలు జితేందర్, ఎండీ సులేమాన్, శ్రీకాంత్, విశాల్ కుమార్‌లు ఉన్నారు.