సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తాను మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నానని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సివిల్ సర్వీసెస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ వివరాలను సైబర్‌క్రైమ్ డీసీపీ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాచుపల్లికి చెందిన కె.సీతయ్య సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి, 2019- 20లో మెయిన్స్ పాసయ్యాడు. అయినా.. ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్, చెడు అలవాట్లకు బానిసై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనపై దృష్టి సారించాడు. ఇందుకు కార్ పూలింగ్ నిర్వహించే బ్లా బ్లా అప్లికేషన్‌ను ఆయుధంగా వాడుకున్నాడు. కార్ పూలింగ్‌లో విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లాడు.
ఆ సమయంలో తన తోటి ప్రయాణికులను పరిచయం చేసుకొని తాను ఎర్కిసన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సీనియర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నానంటూ చెప్పుకుంటూ.. అందులో ఉద్యోగాలున్నాయని, కావాలంటే ఇప్పిస్తామంటూ నమ్మించాడు. ఇందుకు రూ. 2.5 లక్షల వరకు ఖర్చవుతుందంటూ చెప్పాడు. కార్ పూలింగ్‌లో విజయవాడకు వెళ్తుండగా గౌతంకుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు చెప్పిన మాటలు విని, పవన్‌కుమార్ అనే తన స్నేహితుడికి సీతయ్య నంబర్ ఇచ్చాడు. పవన్‌కుమార్.. సీతయ్యకు ఫోన్‌చేసి మాట్లాడటంతో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి.. రూ.2.5 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, రెండు నెలల తరువాత ఉద్యోగంలో చేరాలంటూ సూచించాడు. బాధితుడు కంపెనీకి వెళ్లి ఆరాతీయగా.. అదంతా ఫేక్ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.