సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడికి ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవడంతో నగర శివారు ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం ఆరా తీశారు. మిత్రుడి సూచనతో దళారీని సంప్రదించగా రూ.10లక్షలకు కోరిన బ్రాంచిలో సీటు గ్యారెంటీ అంటూ అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నారు. నెలరోజులు దాటినా అతడు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. మరో ప్రభుత్వాధికారి తన కుమార్తెకు ఇంజినీరింగ్ సీఎస్ఈలో సీటు కోసం ప్రయత్నించారు. అయితే తాము అనుకున్న చోట సీటు దొరుకుతుందనే ఆశతో రూ.లక్షలు చెల్లించారు. కానీ తీరా ఆ బ్రాంచ్‌లో, అదే కళాశాలలో సీటు విషయంలో ఆ దళారీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక, దళారీ దగ్గర డబ్బుల కోసం స్థానిక రాజకీయ నేతను సంప్రదించినట్లు తెలిసింది.
నగరంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల సమయంలో ప్రతీ సంవత్సరం ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలకు ర్యాంకులు రాకముందు నుంచే దళారీలను ఆశ్రయించడం ద్వారా ఈ సమస్య తలెత్తుతున్నదని, ఆ తర్వాత వారు చెల్లించిన దానిలో సగమైనా వెనక్కు తీసుకోలేకపోతున్నారని, కేసులు పెట్టడానికి వీరు ముందుకు రారని ఆయన తెలిపారు. మరోవైపు నీట్ ఫలితాలకు ముందుగానే ఎంబీబీఎస్‌లో సీట్ల కోసం కొందరు దళారులు తల్లిదండ్రులతో సీట్లు ఇప్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో మంతనాలు చేస్తున్నారు. కొంత నగదు చెల్లిస్తే సీటు రిజర్వ్ చేస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో దళారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మేనేజ్మెంట్ కోటా కింద ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామనే ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇంజినీరింగ్‌లో కొన్ని కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎప్‌సెట్‌లో పిల్లలు సరైన ర్యాంకు సాధించకపోవడంతో తల్లిదండ్రులు ఆయా కోర్సుల్లో సీట్ల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థల్లో కోరిన సీటు వస్తుందనగానే లక్షల రూపాయలు ముందే చెల్లిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామంటూ చెప్పడమే దళారులకు అనుకూలంగా మారుతోంది. డబ్బులు చెల్లించిన తర్వాత మోసం జరుగుతున్నదని తెలిసి బయటకు చెబితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో బయటకు చెప్పుకోవడానికి ఫీలవుతున్నారని పోలీసులు చెప్పారు.
కొందరేమో ఫిర్యాదులు చేసినప్పటికీ కేసులు కాకుండా తమకున్న పరపతి, పోలీసులు, రాజకీయ నాయకులతో చెప్పించి దళారుల నుంచి తాము చెల్లించినదానిలోఎంతోకొంత రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులే చెప్పారు. ఇదిలా ఉంటే దేశ, విదేశాల్లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా సీట్లు , స్కాలర్షిప్లు ఇప్పిస్తామంటూ మోసం చేసేవారు కూడా ఇటీవల ఎక్కువయ్యారని వారు పేర్కొన్నారు నకిలీ కన్సెల్టెన్సీల ముసుగులో మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసినా, జైలు నుంచి బయటకొచ్చి మరో ప్రాంతంలో ఇదే దందా కొనసాగిస్తున్నారని పోలీసులు చెప్పారు. విదేశాలలో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామంటూ ఒక కన్సల్టెన్సీ నిర్వాహకులు సుమారు రూ.15లక్షలు తీసుకుని చేతులెత్తేయడంతో బాధితులు పోలీసు అధికారులను ఆశ్రయించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను మోసం చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కాలేజీలు తమకు ఓయూ అనుమతి ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఉస్మానియా అధికారులు సీపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ జరిపిన తర్వాత ఆయా కాలేజీలకు ఓయూ అఫిలియేషన్ లేదని తేలిందని సీపీ చెప్పారు. అలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న దోస్త్ వెబ్సైట్లో నమోదై అందులో చూపిస్తున్న గుర్తింపు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని సీపీ సజ్జనార్ తెలిపారు.