సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిరారెడ్డి ప్రమోటర్‌గా ఉన్న గాయత్రీ ప్రాజెక్ట్ లిమిటెడ్‌ను మోసం చేసిన ఇద్దరు ముంబై ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. సోమాజిగూడలోని జీపీఎల్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నది. చాంపియన్ ఫిన్సెక్ లిమిటెడ్ నిర్వాహకులైన ముంబైకి చెందిన చేతన్ బాలు బాయ్ పటేల్, హర్షవర్ధన్ అవినాశ్ ప్రధాన్‌లు జీపీఎల్ సంస్థ నిర్వాహకులను సంప్రదించి.. ఒక శాతం కమీషన్‌తో కావాల్సిన రుణం అందిస్తామని హామీ ఇచ్చారు. జీపీఎల్ సంస్థ రూ. 11,50,63,575 కోట్ల రుణం కోసం.. 69,63,000 షేర్లు సెక్యూరిటీగా పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. రూ. 32,50,000 షేర్స్‌ను సెక్యూరిటీగా పెట్టి, ఆ మేరకు రుణం మొదట ఇవ్వాలని కోరారు. జూలై 12వ తేదీకి జీపీఎల్ ఖాతాలోకి రుణానికి సంబంధించిన డబ్బు జమ కావాల్సి ఉన్నా.. అది జరగలేదు. సదరు సంస్థ ఆరా తీయగా, తాము సెక్యూరిటీగా పెట్టిన షేర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ మార్కెట్లో అమ్మేశారనే విషయం బయటపడింది. ఇందిరారెడ్డి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ దర్యాప్తు చేపట్టారు. చేతన్, అవినాశ్ ప్రధాన్‌లను ముంబైలో అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.