వెంగళరావునగర్, నవంబర్ 7: ‘అమెరికాలో పుట్టాను.. నాకు పెండ్లి కాలేదు.. అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ సింగపూర్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నది. మాది తూర్పు గోదావరి జిల్లా తుని.. పదో తరగతి వరకు అక్కడే చదివాను. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాను. అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం మధురానగర్‌లో ఉంటున్నా’.. ఇలా మారుపేరుతో మాయమాటలతో ఓ గృహిణిని నమ్మించి మోసం చేశాడు ఓ సైబర్ నేరగాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కేపీహెచ్‌బీ ఐదో ఫేజ్‌లో నివాసముండే ఓ గృహిణికి కార్తీక్‌వర్మ 196 పేరుతో గత మార్చిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. భర్త, కుమార్తె, కుమారుడు ఉన్న 33 ఏండ్ల వయసున్న ఆ మహిళ అభ్యర్థనను అంగీకరించింది. అలా కార్తీక్‌వర్మ అనే మారు పేరుతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లు చేస్తూ.. మెసేజులు పంపేవాడు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమైందంటూ.. ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా రూ.70 వేలు తీసుకున్నాడు. ఆమె నుంచి సొమ్ములు, డబ్బును మరింత గుంజాలని పథకం వేశాడు.
‘ఇండియాకు వచ్చాను.. నిన్ను కలవాలని ఉందం’టూ చెప్పాడు. ఎస్ఆర్ నగర్‌లోని అమరావతి టిఫిన్ సెంటర్‌కు పిలిపించాడు. అమ్మకు వైద్యశాలలో చికిత్స చేయించాల్సి ఉందని, వైద్యానికి డబ్బు అవసరమైందని నమ్మించాడు. డబ్బు లేదని ఆమె బదులివ్వడంతో.. బంగారు ఆభరణాలు తెచ్చి ఇవ్వాలని.. త్వరలోనే తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన ఆ గృహిణి.. జూన్ 15న 18.5 తులాల బంగారు నగలను తెచ్చి అతడి చేతిలో పెట్టింది. తీసుకున్న డబ్బు, బంగారు నగలను తిరిగి ఇవ్వకపోగా, ఫోన్లు చేసినా కార్తీక్‌వర్మ బదులివ్వకపోవడంతో.. ఆ గృహిణికి సందేహం కలిగి.. అతడి గురించి ఆరా తీసింది. అతడు కార్తీక్‌వర్మ కాదని.. అసలు పేరు మహ్మద్ రఫీ, గుంటూరుకు చెందిన వంటలు చేసే వాడిగా గుర్తించింది. అతడికి భార్య అస్మభాను , కూతురు, తల్లి షేక్ అస్మత్ కూడా ఉన్నట్లు తెలుసుకొని నిర్ఘాంతపోయింది. శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.