సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోలార్ ప్యానల్స్ సామగ్రి కోసం కంబోడియా దేశానికి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన నగరానికి చెందిన సంస్థ రూ. 70 లక్షలు మోసపోయింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న నోవిస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ ఇతర దేశాల నుంచి సామగ్రిని దిగుమతి చేసుకొని.. సోలార్ ప్యానల్స్ తయారు చేస్తుంటుంది. కంబోడియాలోని సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి ఓ సారి సామగ్రి కొనుగోలు చేసింది. ఈ సంస్థకు చైనాలో ప్రధాన కార్యాలయం ఉంది. అయితే రెండోసారి కూడా నోవిస్ నిర్వాహకులు ఆర్డర్ పెట్టారు. అందులోభాగంగా 1.46 లక్షల డాలర్లు (సుమారు రూ. 1.06 కోట్లు) చెల్లించారు.
ఆ డబ్బు ముట్టిన తరువాత కంబోడియా సంస్థ చేతులెత్తేసింది. దీంతో నోవిస్ సంస్థ ప్రతినిధులు కంబోడియాలోని భారత ఎంబసీకి ఫిర్యాదు చేయగా, సదరు సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కాంబోడియా సంస్థ నుంచి 50 లక్షల డాలర్లు హైదరాబాద్ సంస్థకు వెనక్కి పంపించారు. మిగతావి 96 వేల డాలర్లు (సుమారు రూ. 70 లక్షలు) మాత్రం ఇవ్వకుండా సమాధానం దాటవేస్తుండటంతో నోవిస్ ప్రతినిధులు గురువారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.