అమీర్పేట్, జూలై 14 : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లో అమాయకులను మోసం చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలు కటకటాల పాలయ్యారు. సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న అయేషా తబస్సుమ్ను గతవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, బుధవారం మరో నిందితురాలు సుప్రియను సనత్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. నలుగురు బాధితులు మాత్రమే ఫిర్యాదు చేశారని, బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని, గత వారం అరెస్టయిన అయేషా తబస్సుమ్ను కస్టడీకి తీసుకుని విచారిస్తామని సనత్నగర్ పోలీసులు తెలిపారు.