మారేడ్పల్లి, ఆగస్టు 31 : చిట్ ఫండ్ పేరుతో ఓ వ్యక్తి 28 మందిని మోసం చేసిన సంఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్మారేడ్పల్లిలోని భవానీ చిట్ఫండ్ యజమాని శ్రావణ్ కుమార్ చిట్టీల వ్యాపారం చేసేవాడు. ఇందులో భాగంగా 50 మందికి పైగా శ్రావణ్ కుమార్ వద్ద చిట్టీలు వేశారు. గత కొద్ది రోజులుగా ఈ చిట్ ఫండ్ మూసి ఉండటంతో ప్రజలకు అనుమానం వచ్చి కార్యాలయం వద్దకు వెళ్లి ఆరా తీయగా సంస్థను ఎత్తివేసినట్లు తెలిసింది. ఈ విషయమై వినోద్ కుమార్ అనే న్యాయవాది మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా 28మంది బాధితుల నుంచి రూ.కోటి 28 లక్షలు మోసం చేసినట్లు తేలింది. మరికొంత మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే త్వరలోనే నిందితుడిని పట్టుకుంటున్నామని పోలీసులు తెలిపారు.