బంజారాహిల్స్,జూన్ 29: స్థలం అమ్ముతానంటూ కోట్లాది రూపాయలు తీసుకుని.. రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివాసం ఉంటున్న గౌసియా బేగం రహిమ్ అనే మహిళకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 13.38 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని అమ్ముతామని చెప్పడంతో పాటు రిజిస్ట్రేషన్ తదితర పనుల కోసం బంజారాహిల్స్ రోడ్ నం.12లో నివాసం ఉంటున్న సయ్యద్ హమీదుద్దీన్కు జీపీఏ చేశారు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మహేశ్వరం మండలం గంగారామ్ తండాకు చెందిన మనావత్ రవీందర్ ముందుకు వచ్చాడు.
ఎకరాకు రూ.98లక్షల చొప్పున ధరగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హమీదుద్దీన్ అగ్రిమెంట్ చేయడంతో రవీందర్ పలు దఫాలుగా సుమారు రూ.11కోట్లు చెల్లించాడు. మిగిలిన డబ్బును రిజిస్ట్రేషన్ రోజున ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ నెల 26న రిజిస్ట్రేషన్ చేసేందుకు హమీదుద్దీన్ మహేశ్వరం తాసీల్దార్ కార్యాలయానికి రావాల్సి ఉండగా ముఖం చాటేశాడు. దీంతో రిజిస్ట్రేషన్ విషయంపై మాట్లాడేందుకు బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని హమీదుద్దీన్ ఇంటికి రాగా దుర్బాషలాడటంతో పాటు బెదిరింపులకు దిగాడు. దీంతో తనను మోసం చేసిన హమీదుద్దీన్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు రవీందర్ సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడు హమీదుద్దీన్పై ఐపీసీ 406,420,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.