Youtube | సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): రూ.20 నాణెం ఇస్తే రూ.50లక్షలు ఇస్తామంటూ యూట్యూబ్‌లో ఒక వీడియో ప్రకటన చూశాడు… అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌చేసి వారు చెప్పిన విధంగా డబ్బులు పంపి నగరానికి చెందిన ఓవ్యక్తి మోసపోయాడు. హైదరాబాద్‌లోని దారుల్‌షిఫాకు చెందిన 68 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్‌లో రూ.20 కాయిన్ ఉంటే రూ.50లక్షలకు కొనుగోలు చేస్తామంటూ ఓ వీడియో ప్రకటన చూసి ఆ ఆఫర్‌ను నమ్మాడు. అందులో ఇచ్చిన ఫోన్‌నంబర్‌కు కాల్చేస్తే రాజ్గ్యాని అనే వ్యక్తి మాట్లాడాడు.
నాణెం కొనడానికి ఆసక్తి ఉందని, అంతకంటే ముందు ఒక ఫైల్‌ను క్రియేట్ చేయాలంటూ రూ.1500 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అటునుంచి వేర్వేరు సాకులు చూ పుతూ పలు దఫాలుగా డబ్బులు అడుగగా బాధితుడు రూ.1,46,100 బదిలీ చేశాడు. చివరకు ఈ ఆఫర్ పూర్తికావాలంటే మరో లక్ష కావాలంటూ సైబర్ నేరగాడు డిమాండ్ చేయడంతో బాధితుడు ఇదంతా మోసమని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.