జీడిమెట్ల, జనవరి 23: రోడ్డు రోలర్ వాహనాలను దొంగతనం చేసి అమ్ముకుంటున్న నలుగురు దొంగలను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేశ్‌కుమార్, ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్, డీఐ కనకయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. బాలానగర్‌కు చెందిన బి.లక్ష్మణ్ రోడ్డు రోలర్ నడుపుతుంటాడు. లక్ష్మణ్ రోజు మాదిరిగానే 20వ తేదీన రాత్రి రోడ్డు రోలర్(ఏపీ 13 7212) వాహనాన్ని జీడిమెట్ల దూలపల్లి రోడ్డులో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి రోడ్డు రోలర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకుని వెళ్తుండగా.. గమనించిన స్థానికులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు డీసీఎం వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన కర్ణాటకకు చెందిన అఫ్రోజ్ అహ్మద్ పటేల్(24) జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ ఇబ్రహీం(31), కుత్బుల్లాపూర్‌కు చెందిన షేక్ అన్వర్(35), అదే ప్రాంతానికి చెందిన బల్లరాం సత్యనారాయణ(47)లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే తరహాలో గతంలో గోపీ అనే వ్యక్తికి చెందిన రోడ్డు రోలర్‌ను(ఏపీ13 9348) దొంగిలించి ముక్కలు చేసి విక్రయించినట్లు ఒప్పుకున్నారు. మరో దొంగ సయ్యద్ ముస్తాఫా పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.4.5లక్షల విలువజేసే ఒక రోడ్డు రోలర్, డీసీఎం, రెండు క్రేన్లు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన డి.కనకయ్య, ఎస్ఐ శ్యాంబాబు, హెడ్‌కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.వి.సుబ్బారావు, ఎస్.ఆంజనేయులు, టి.సాయి, ఫణింద్రలను డీసీపీ అభినందించారు.