హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌లో ఉన్న కోరం క్లబ్, బేజీలోన్ పబ్‌తోపాటు మరో మూడు పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లను సీజ్ చేశారు.
విస్కీతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన శరత్‌చంద్రారెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5లో హరికేఫ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను నిర్వహిస్తున్నాడు. యువతను ఆకర్శించి.. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే దిశగా నిబంధనలకు విరుద్ధంగా మద్యంతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి.. విక్రయిస్తున్నాడు. దయాకర్‌రెడ్డి, శోభన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మత్తు ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు గుర్తించారు.
ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్శిస్తున్నట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నం.1, 5లోని ఐస్‌క్రీమ్ పార్లర్లపై దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.5 కిలోల విస్కీ ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.