Bollaram | బొల్లారం, జూన్ 20 : తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన ఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలోకి ఇద్దరు పురుషులు, బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు అక్రమంగా ప్రవేశించి వీడియోలు చిత్రీకరించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధమని వారిని ఆదేశించారు.
కాగా నిందితులు మేము ఆర్మీ జవాన్లమే అంటూ ఐడెంటి కార్డులు చూపించారు. దీంతో స్థానిక జవాన్లు వారు ఐడి కార్డులను పరిశీలించి ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఐడి కార్డులను పరిశీలించిన అధికారులు అవి నకిలీ ఐడి కార్డులని గుర్తించారు. వెంటనే తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మీ సెంటర్లోకి నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించిన వారు ఎక్కడి నుండి వచ్చారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.