Hyderabad | మాదాపూర్, ఫిబ్రవరి 20 : గంజాయి సేవిస్తున్న ఐదుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మాదాపూర్ చందా నాయక్ తండాలోని జీఆర్సీ రెసిడెన్సి అపార్ట్మెంట్లో గంజాయి సేవిస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అపార్ట్మెంట్ పెంట్ హౌస్‌లో ఉన్న వ్యక్తులను తనిఖీ చేయగా అందులో వెంకటేష్, విజయ రెడ్డి, రాహుల్, శివకుమార్‌తో పాటు మరో యువతి ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. వారికి యూరిన్ టెస్ట్ కిట్టు ద్వారా పరీక్షలు నిర్వహించగా వారు గంజాయి సేవించినట్లు తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా వీరికి మత్తు పదార్థాలు విక్రయించిన వ్యక్తి ఇంటి యజమాని రామచంద్ర రెడ్డిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం కొరకు వెతుకుతుండగా, మరో వ్యక్తి ఐటీ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు.