సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): కారులో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. కాప్రా ప్రాంతానికి చెందిన యోగేశ్ ఆర్కే పురానికి చెందిన అశ్విన్ నుంచి అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. సోమవారం కాప్రా, పద్మశాలి టౌన్షిప్ ప్రాంతంలో కారులో తిరుగుతూ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్ఐ బాల్‌రాజు తన సిబ్బందితో కలిసి నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 3.20గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు 12.34కిలోల ఓజి కుష్ మత్తుపదార్థంతో పాటు కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
యూసఫ్‌గూడ మెట్రో స్టేషన్ సమీపంలో గం జాయి అమ్మకాలకు పాల్పడుతున్న రాజేశ్నాయక్ను ఆబ్కారీ ఎస్టీఎఫ్ ఎస్సై జ్యోతి తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు మోద్ సునీల్‌పై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
పటాన్చెరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ బృందం అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుంచి 1.15కిలోల గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు ప్రాంతానికి చెందిన చీటుకుల సాయి కిరణ్ , మహేశ్ స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుల నివాసాలపై దాడులు జరిపి, వారిని అరెస్టు చేశారు.