మేడ్చల్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా త్వరలోనే మల్కాజిగిరి నియోజకవర్గంగా రూపుదిద్దుకోనున్నది. నియోజకవర్గంలో ఓ వైపు రైల్వే గేట్లు.. మరో వైపు ఏవోసీ రహదారులతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు తీరనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు.
నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి అలుపెరగకుండా తీసుకెళ్లి నిధులను సాధిస్తున్నారు. ఆర్కేపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్య లేకుండా 4 లైన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఆర్కేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మల్కాజిగిరి నియోజకవర్గం పూర్తిగా ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా మారనున్నది. ఆర్కేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మల్కాజిగిరి నియోజకవర్గంతో పాటు ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా మారనున్నది.
సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు సుమారు 4 లక్షల మంది పైగా ఆర్కెపురం బ్రిడ్జిపై ప్రయాణిస్తుంటారు. ఆర్కేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తీర్ణం తక్కువ ఉన్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళ్లలో బ్రిడ్జిపై వాహనాలు కిక్కిరిసిపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 210 కోట్లు.. బ్రిడ్జికి అనుబంధంగా ఆర్యూబీ నిర్మాణానికి రూ. 35 కోట్ల నిధులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేయించిన క్రమంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
నేరెడ్మెట్ చౌరస్తా టు మిల్ట్రీ హాస్పిటల్..
మల్కాజిగిరి నియోజకవర్గంలోని నేరేడ్మెట్ చౌరస్తా నుంచి మిల్ట్రీ హాస్పిటల్ వరకు సుమారు ఆర కిలోమీటర్ వరకు ఆర్కేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ప్రసుత్తం ఉన్న బ్రిడ్జి రెండు వరుసలే ఉండటంతో ప్రస్తుత ట్రాఫిక్‌కు సరిపోవడం లేదు. అందుకే కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్‌ను ట్రాఫిక్ సులువుగా కదిలేలా నాలుగు లైన్లుగా నిర్మాణం చేపట్టానున్నారు.
కీసర, రాంపల్లి, ఈసీఐఎల్, కుషాయిగూడ, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు వివిధ పనులు ఉద్యోగాల కోసం ం సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే కచ్చితంగా ఆర్కేపురం బ్రిడ్జిపై నుంచే వెళ్లాల్సి వస్తుంది. విస్తీర్ణం చిన్నదిగా ఉన్న బ్రిడ్జిపై వాహనాలు చెడిపోయినా.. ప్రమాదాలు జరిగిన గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీనికి బ్రిడ్జి విస్తీర్ణం పెరిగితే తప్ప.. మార్గం లేకపోవడంతో ఎమ్మెల్యే మర్రి.. సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులను అనేకసార్లు కలిసి ఒత్తిడి తీసుకవచ్చి బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు.
టెండర్ల ఆహ్వానం పూర్తయిన వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్కాజిగిరి సర్కిల్లో నీటి సమస్య భవిష్యత్‌లో రాకుండా గౌతంనగర్ డివిజన్లో 5 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 14.95 కోట్లు, మల్కాజిగిరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు రూ. 1.35 కోట్లు, నేరేడ్మెట్లో జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ. 2. 50 కోట్లు, జిల్లా న్యాయస్థానం భవనానికి రూ. 42 కోట్లు నిదులను మంజూరు చేయించారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో బాక్స్ డ్రైనేజీలకు సంబంధించి రూ. 7.70 కోట్లు మంజూరు అయ్యాయి.
ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా
మల్కాజిగిరి నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు అయినా తీసుకెళ్తా. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ అవగాహన చేసుకున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నా. ఇప్పటికైతే ఆర్‌యూబీలు, ఏవోసీ రహదారుల, ఆర్కేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను తీసుకువచ్చాను.
ఇంకా నియోజకవర్గానికి చాలా చేయాల్సి ఉంది. సమస్యలన్నీ తీరే వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు అధికారులను కలుస్తూనే ఉంటా. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా. ముఖ్యంగా మల్కాజిగిరి జరుగుతున్న ప్రభుత్వ భూములను అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ప్రభుత్వ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అధికారులపై ఒత్తిడి తేస్తున్నా.
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి