సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : సుంకిశాల ఘటన నేపథ్యంలో జలమండలి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సుంకిశాల ప్రాజెక్టులో రిటైయినింగ్ వాల్ నిలువునా కుప్పకూలిన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ప్రాజెక్టు విభాగం అధికారులపై రెండు రోజుల కిందట చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు డివిజన్ సర్కిల్-3 (సుంకిశాల)లో పనిచేస్తున్న సీజీఎం ఎస్. కిరణ్‌కుమార్, జీఎం బి.మరియరాజ్, డీజీఎం ఎన్.ప్రశాంత్, మేనేజర్ కేవీపీ హరీశ్‌ను సస్పెండ్ చేశారు.
ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ప్రాజెక్టు డివిజన్-3లో కొత్త ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగిస్తూ.. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ అండ్ ఎం సర్కిల్-2లో పనిచేస్తున్న టీవీ శ్రీధర్‌ను ప్రాజెక్టు డివిజన్ సర్కిల్-2కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎం. రఘుకు బాధ్యతలు అప్పగించారు. ప్రాజెక్టు డివిజన్-3 జీఎంగా బి. మహేశ్‌కుమార్, డీజీఎంగా అభిలాశ్, మేనేజర్‌గా స్వామిని నియమించారు.
అలాగే జలమండలి పీ అండ్ ఏ డైరెక్టర్‌గా సుదర్శన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఎండీ ఆశోక్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈఎన్సీ, రెవెన్యూ వీఎల్ ప్రవీణ్ అదనంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీ అండ్ ఏ డైరెక్టర్ బాధ్యతలను సుదర్శన్‌కు అప్పగించారు. కాగా, సుంకిశాల ఘటనలో పర్యవేక్షణ లోపాన్ని కారణంగా చూపుతూ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌ను నాన్-ఫోకల్ పోస్టుకు బదిలీ చేస్తూ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.