బొల్లారం, మార్చి 30 : బొల్లారం పారిశ్రామిక వాడలోని వెంకటరెడ్డి నగర్ కాలనీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఉమామహేశ్వరరావుకు చెందిన మూడంతస్తుల భవనంలో 16 పోర్షన్లలో 16 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న 4 బైకులు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న సందారం దొర అనే వ్యక్తి స్థానికులకు సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమై భవనంలోని 60 మంది వ్యక్తులను వెనక, ముందు గేట్ల నుంచి కిందికి తరలించి కాపాడారు. స్థానికులు డయల్ 100 కాల్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ రవీందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పెట్రోలింగ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ ఇంజిన్ సహాయంతో ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.