కంటోన్మెంట్, మే 26: పార్కుచేసి ఉన్న బైకులను మారు తాళాలతో చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరినుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బేగంపేట ఏసీపీ పృథ్వీధర్ రావు, కార్ఖానా ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సై జ్ఞానదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 14న కార్ఖానా బాలాజీనగర్ కాకాగూడకు చెందిన కొంతం హరికృష్ణ తన ఇంటి ముందు బైకును పార్కు చేసి గజ్వేల్‌కు వెళ్లాడు. తిరిగి 15న తన ఇంటికి వచ్చి చూడగా.. పార్కు చేసిన బైకు కనిపించకపోవడంతో కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీకి చెందిన పవన్ (22) పార్కు చేసి ఉన్న బైకు దొంగిలించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. వెంటనే అతడిపై ఆరా తీయగా.. 25వ తేదీన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదస్థితిలో అతడు తిరుగుతుండగా క్రైమ్ కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హైదరాబాద్‌లో పలుచోట్ల పార్కు చేసి ఉన్న బైకులను మారు తాళాలతో చోరీ చేసినట్లు వెల్లడించాడు. పవన్‌తో పాటు అతడి చిన్ననాటి స్నేహితులైన ఖైరతాబాద్‌కు చెందిన హరిచంద్ర నాయక్ (19), కక్కల చిన్న (23), కక్కల దుర్గాప్రసాద్ (22) కలిసి పార్కు చేసి ఉన్న వాహనాలను మారు తాళాలతో దొంగిలించినట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితుల నుంచి 14 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.