మెహిదీపట్నం జూన్ 22: రౌడీషీటర్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని దక్షిణ,పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, అదనపు డీసీపీ అష్వాక్ అహ్మద్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలస్వామిలతో కలిసి వివరాలు వెల్లడించారు.
మల్లేపల్లి ఆగాపురాలో నివసించే షేక్ అలీ అలియాస్ అలీం (34) పూల అలంకరణ వ్యాపారం చేస్తుండేవాడు. ఇతడిపై హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉంది. షాహేద్(29), పాషా(32), షేక్ ఫెరోజ్ పాషా(30), సయ్యద్ గౌస్(32) అలీంకు స్నేహితులు. స్నేహితుల వద్ద డబ్బులు దోచుకొని అలీం మద్యం తాగేవాడు. పైగా ‘మీ అంతు చూస్తానం’టూ.. బెదిరించేవాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన స్నేహితులు.. ఫీల్‌ఖానా రోడ్లో ఉన్న వైన్స్ వద్ద అలీంను పిలిచి కత్తులతో పొడిచి చంపేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.