ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 18: ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ(60) గుండెపోటుతో కన్నుమూశారు. మధ్యాహ్నం 12 గంటల సమ యంలో ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1997లో చేరారు. ఆయన గతంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్, ఓయూ ఫిజికల్ డైరెక్టర్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీఎస్ పీఈసెట్‌కు 2019 నుంచి 2022 వరకు కన్వీనర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పాలమూరు యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మికాంత్ రాథోడ్, ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, తదితరులు సంతాపం తెలిపారు. ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా వడ్డేపల్లిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.