బేగంపేట్, మార్చి 2: భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు అని మాజీ మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్భంగా శనివారం బేగంపేట్‌లోని రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణం పీవీ నర్సింహారావు భవన్లో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పీవీ నర్సింహారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
దీంతో పాటు పీవీ నర్సింహారావు ఫొటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పీవీ నర్సింహారావుకు భారత రత్న ప్రకటించడం దేశానికే గర్వకారణమని అన్నారు. భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని అన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎంతో విశిష్టమైన సేవలందించారని గుర్తు చేశారు.
ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత కూడా పీవీ నర్సింహారావుకే దక్కుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. దేశంలో 17భాషలు మాట్లాడగలిగే వ్యక్తి పీవీ ఒక్కరేనని అన్నారు. తన పరిపాలనలో దక్షతతో ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పారని అన్నారు. అలాంటి మహానీయుడికి భారతరత్న ప్రకటించాలని తాము పలుమార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా పీవీ నర్సింహారావు శతజయంతిని సంవత్సరం పాటు ఎంతో గొప్పగా నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరణించిన తర్వాత కూడా ప్రజల మనస్సుల్లో కొందరు మాత్రమే నిలిచి పోతారని, అందులో పీవీ ముందు వరుసలో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, సోలార్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ శేఖర్ మారంరాజు, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.