Chirumarthi Lingaiah | సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో చేపట్టిన విషయం తెలిసిందే. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఈ నెల 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన గురువారం జూబ్లీహిల్స్ ఠాణాలో ఏసీపీ వెంకటగిరి బృందం నిర్వహించిన విచారణకు హాజరయ్యారు.
గంటన్నర పాటు ఆయనను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. అదనపు ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌కు సంబంధించిన వివరాలపై పోలీసులు ప్రశ్నించారని వెల్లడించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. తనకు తెలిసిన అధికారి కాబట్టి గతంలో తిరుపతన్నతో మాట్లాడానని, మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ల ఫోన్ నంబర్లు ఆయన అడిగాడని, తన అనుచరుల వద్ద నుంచి ఆ నంబర్లు సేకరించి ఆయనకు ఇచ్చానని, అదే విషయాన్ని విచారణలో వెల్లడించానన్నారు.
నంబర్లు ఎందుకని తిరుపతన్నను ప్రశ్నించానన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందనే విషయాన్ని తిరుపతన్న తనను అడిగాడని, ప్రచారానికి సంబంధించి కూడా ఫోన్లో మాట్లాడానన్నారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశాననేది అవాస్తవమని, మీడియాలో ఎక్స్పోజ్ కావాలనే ఉద్దేశంతో కొంత మంది నాపై కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నన్ను ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని పోలీసులకు చెప్పానని ఆయన వెల్లడించారు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారని, నా వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారని తెలిపారు. రాజకీయ నాయకులతో పరిచయం ఉన్న పోలీసు అధికారులు, ఇతర అధికారులు మాట్లాడుతుంటారని, మేం కూడా వాళ్లతో మాట్లాడుతుంటామన్నారు. అలాంటిది ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపులో భాగంగానే ఇలా విచారణకు పిలిపించారని ఆరోపించారు.