సైదాబాద్, మే 24: భారత దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అద్భుతమైన పరిపాలన కొనసాగించారని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం ఖాయం అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దీమా వ్యక్తం చేశారు. మలక్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి మహమ్మద్ ఆజం అలీ ఆధ్వర్యంలో పాతబస్తీ.. మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, చార్మినార్ నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విస్తృతస్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు-ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై ఆదివారం అజంపురా డివిజన్ పరిధిలోని ఆజం ఫంక్షన్లో అవగాహన కార్యక్రమం జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్‌తో కలిసి తలసాని ప్రసంగించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురడం ఖాయమని.. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు బీఆర్ఎస్వేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుందని, కేసీఆర్ పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.

పాతబస్తీలో జెండా ఎగురవేస్తాం
మాజీ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పాతబస్తీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమని, నియోజకవర్గాల్లో డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. బెవరెజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధిపనికూడా ముందుకు సాగడంలేదని, అన్నారు. మలక్‌పేట బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మహ్మద్ ఆజం అలీ, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తీగల అజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు..అలీ మస్కతి, ఇనాయత్ బాక్రీ, రాంరెడ్డి, శ్రీకాంత్, బాబు సుదర్శన్, షహీన్ అప్రోజ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కొరుడ భూమేశ్వర్, ఫైబర్ టెల్ బీఎన్ రాజు, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్నారెడ్డి, అనితానాయక్, రాధా, అమరేందర్ గౌడ్, లలిత, బాబు సుదర్శన్, డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ధర్మరాజ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.