‘కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత విధానాలకు చరమగీతం పాడే వరకు పోరాటం చేద్దామంటూ..యువతకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరుద్యోగుల వంచన సభలో ఆయన ప్రసంగించారు. రెండున్నరేండ్లుగా ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్లు దేశమంతా చెప్పుకొంటున్న అబద్ధాల కోరు సీఎం రేవంత్‌రెడ్డి అని తలసాని మండిపడ్డారు. యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, యువతులకు స్కూటీలు ఇస్తామని నమ్మకద్రోహం చేశారన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు శోకం మిగిల్చవద్దని, ధైర్యం గా ఉండాలని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి, నిరుద్యోగ జేఏసీ నేతలు ఇంద్రా నాయక్, ఆకాశ్, శంకర్, ప్రత్యుష, భుక్యా కుమార్ పాల్గొన్నారు.
-ఎల్బీనగర్
ఎల్బీనగర్,జూన్ 4 : కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు చరమగీతం పాడే వరకు పోరాటం చేద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. దిల్సుఖ్నగర్ చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల వంచన సభలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాకేశ్రెడ్డిలతో పాటు పలువురు నిరుద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవర్చకుండా మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని దేశమంతా చెబుతున్న ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గులేదని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలోఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులే దేశాన్ని గడగడలాడించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ‘మా రాష్ట్రం మాకు కావాలి అంటూ’ వీరోచిత పోరాటం చేసిన ఘనత విద్యార్థులదేనని, ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్‌ది అయితే దానిని నడిపించింది విద్యార్థులేనన్నారు. ప్రభుత్వ లెక్కల్లో వాస్తవాలు తెలుస్తాయని, ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో నిజాలు ప్రభుత్వ లెక్కలు తెలుపుతాయన్నారు. కేసీఆర్ 100కు 90 శాతం ఉద్యోగాలు తమ పిల్లలకే కావాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమేనన్నారు. తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించారన్నారు. సరూర్‌నగర్‌లో ప్రియాంకగాంధీ, అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. యువతకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. యువతులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో అద్భుతమైన అభివృద్ధి చేసి, రియల్, ఐటీ రంగాలను పెంచి ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఓ వైపు మూసీ కడతానని, ప్యూచర్ సిటీ అంటూ నమ్మబలుకుతున్నాడని విమర్శించారు. మూసీ పరిసర ప్రజలు సీఎం రేవంత్‌ను తిట్టే తిట్లు చూశారా, నేనైతే మూసీలో పడి చచ్చేవాడినని అన్నారు. కేసీఆర్ అప్పులు చేశాడని అంటున్నారు.. కేసీఆర్ సెక్రటేరియేట్, గురుకులాలు, ఇంజినీరింగ్ కాలేజీలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశాడన్నారు. నాడు తెలంగాణలో నీరు లేని పరిస్థితుల్లో మిషన్ కాకతీయ, మిషన్ భరీరథ ద్వారా తాగు, సాగునీరు అందించాడన్నారు.
24 గంటల విద్యుత్ సరఫరా చేశాడన్నారు. త్వరలోనే లక్షలాది మందితో నిరుద్యోగుల కోసం ప్రియాంక గాంధీ పాల్గొన్న మైదానంలోనే ఓ సభను పెట్టబోతున్నామని అన్నారు. విద్యార్థుల కోసం వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే కేసీఆర్ దానిని కంటిన్యూ చేశారన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని, నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. మనం పోరాటం చేద్దామని, ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలకు చరమగీతం పాడే వరకు ఆగబోమన్నారు.
నిరుద్యోగుల కడుపు కాలుతోంది
చదువుకున్న యువత కడుపు కాలుతోందని.. తమ పిల్లలు బాగుండాలని గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను చమట, రక్తాన్ని ధారపోసి మంచి చదువు చదివించారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు పంపి శిక్షణ ఇప్పిస్తున్నారని.. విద్యార్థులు కూడా బాగా చదువుకుని తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి ఉద్యోగ వేటలో ఉండి కలలు కంటే ఆ కలలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఏడాదితో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.
ఉద్యోగాలే కాక రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు లోన్లు ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా యువతను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని 60వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని తాము ఆశ పడితే కేవలం 270 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఇది అబద్ధాలు ఆడే ప్రభుత్వం అని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర పట్టనీయమన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు..
నిరుద్యోగుల సభ చైతన్యపురిలో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. హాల్ పరిసరాల్లో ఏసీపీ కృష్ణయ్యతో పాటుగా పలువురు సీఐలు భారీగా వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉద్యమ నాయకుడు అశోక్ సార్, యువ నాయకులు గండి సన్నీ యాదవ్, భవానీ ప్రవీణ్‌కుమార్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, జిన్నారం విఠల్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, నిరుద్యోగ నాయకులు ఇంద్రానాయక్, కుమార్, ఆకాశ్, శంకర్, శింపు, నవీన్, ఉపేందర్, సింధు, విక్రమ్, దామోదర్‌రెడ్డి, అశోక్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల సెగ తగిలింది
సీఎం రేవంత్‌రెడ్డికి జూన్ 2న నిరుద్యోగుల సెగ తగిలిందని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల భయం పట్టుకునే మధ్యలోంచి పారిపోయాడన్నారు. తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరంటూ విమర్శించారు. జీవో 46 అభ్యర్థులను హైకోర్టులో అడ్డుకున్నా వారు కేటీఆర్ అండతో సుప్రీం కోర్టుకు వెళ్లారన్న కడుపుమంట ఉందన్నారు. అంగట్లో అర్రాస్ పాడినట్లు హామీల పాట పడి గద్దెను ఎక్కారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఏ ఏడాదో చెప్పడం లేదన్నారు.
జీవోల పేరుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారని, వారు నిరుద్యోగ అభ్యర్థులను హైకోర్టులో ఓడించారని ఆరోపించారు. ప్రైవేటు కంపెనీల్లో 90 శాతం రిజర్వేషన్లు అన్నారు కానీ.. ప్రైవేటు కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో పోలీస్ విభాగంలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. కాంగ్రెస్ కేవలం 200 పోస్టులు ప్రకటించి ఏదో చేసినట్లుగా గప్పాలు కొడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే దశ, దిశ మారుతుందని భావించిన నిరుద్యోగులకు నిరాశ మిగిలిందన్నారు. దిల్సుఖ్నగర్ కాస్తా దిల్ దుఖః నగరం, అశోక్‌నగర్ శోఖ నగరంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పై బీఆర్ఎస్ కమిట్మెంట్తో పనిచేస్తుందన్నారు. 3,800 పోస్టులకు గాను ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని బుర్ర వెంకటేశ్ చెప్పటం శోచనీయమన్నారు. నిరుద్యోగులను కూలీలని అంటావా అంటూ రేవంత్‌రెడ్డిని
ప్రశ్నించారు.
– బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి
కాంగ్రెస్ భరతం పడుతాం
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వంచించింది.. నిరుద్యోగుల కడుపుకోత, ఆవేదన, ఆక్రందన ప్రభుత్వ పెద్దలకు తెలియడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, శరం లేదని, తమకు ఇచ్చిన ఉద్యోగాలను లెక్కలతో తమ వద్దకు వస్తే ఈడ్చి, ఈడ్చి తన్నుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగాం…రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు.
– నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్
ఉరికించి కొడతాం
నిరుద్యోగుల సభను బీఆర్ఎస్ సభ అంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఉరికించి దిల్‌సుఖ్‌నగర్‌లో కొడతామని నిరుద్యోగ జేఏసీ నేత ఆకాశ్ అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. పోలీస్ అభ్యర్థుల కష్టాలు ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుసా అంటూ ప్రశ్నించారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి తడిబట్టలతో 70 వేల ఉద్యోగాలు ఇచ్చానని ప్రమాణం చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వానికి ఘోరి కడుదామని అన్నారు.
– నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఆకాశ్
నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిపోతున్నాయి
నీళ్లు , నిధులు నియామకాల కోసం తెలంగాణ తెస్తే కాంగ్రెస్ హయాంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు తరలిపోతున్నాయని నిరుద్యోగ నాయకుడు శంకర్ ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగులు అలమటిస్తుంటే కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చేదాక ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతుందన్నారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న మనం మన హక్కులు, మన ఉద్యోగాలు కొట్లాడి తెచ్చుకోలేమా అన్నారు. రేవంత్‌రెడ్డిని వదిలేది లేదని, గద్దె దింపుతామన్నారు.
– నిరుద్యోగ జేఏసీ నాయకుడు శంకర్
ఆశలు అడియాసలయ్యాయి
తెలంగాణ ఉద్యమాల గడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని నిరుద్యోగ నేత ప్రత్యుష ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆశలు, అడియాసలు అయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లేని ప్రాంతంలో నిరుద్యోగుల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణ నిరుద్యోగుల గురించి కనీసం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
– నిరుద్యోగ నేత ప్రత్యుష
జీవో 108ని రద్దు చేయండి
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 108ని రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకుడు భుక్యాకుమార్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సెపరేట్‌గా, నిరుద్యోగులకు సెపరేట్ టెట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గోడలకు సున్నం వేసుకునే సీఎం రేవంత్‌రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఉంటే ఇక నాణ్యతతో కూడిన విద్య ఎలా లభిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఎంత దరిద్రంగా ఉందో చూస్తే బాదేస్తుందన్నారు. ఒకే విభాగంలోని వారిని ఒకరు మాట్లాడే సమాచారం మరొకరి ఉండటం లేదన్నారు. సీఎం ఇల్లు ముట్టడించి అయినా డీఎస్సీ ఒకే నోటిఫికేషన్ విడుదల చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు.
– నిరుద్యోగ జేఏసీ నాయకుడు భుక్యా కుమార్