బడంగ్పేట్, ఏప్రిల్ 15: ఈనెల 27 న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రామిడి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అధోగతి పాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల పైన పన్నుల భారం మోపుతున్నారన్నారు. హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం డమాల్ అయిపోయిందన్నారు. రైతులను, కూలీలు, ఏ వ్యాపారిని తట్టిన కన్నీటి పర్యంతం అవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుంద న్నారు. రాష్ట్రం ఏమైపోతుందోనని ముఖ్యమంత్రికి సోయిలేదన్నారు. కేసీఆర్ పేరు లేకుండా చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ సుస్థిరంగా ఉన్నారని తెలిపారు. ఆయన వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గడ్డి అన్నారం మాజీ అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కందుకూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జయేందర్ ముదిరాజు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ బీ ఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మయ్య,, వెంకట్ రెడ్డి, దీప్ లాల్ చౌహాన్, గడ్డి అన్నారం మాజీ చైర్మన్ రామ్ నరసింహ గౌడ్, జిల్లా అల్పూరు సునీత బాలరాజ్, బీరప్ప, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
గంగపుత్రుల మద్దతు అభినందనీయం
గోల్నాక, ఏప్రిల్ 15: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అంబర్‌పేట గంగపుత్రులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను పోత్గల్ గంగపుత్ర సంఘం ప్రతినిధులు కలసి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వస్తామ ని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులునిండాయన్నా రు.
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను వేసి గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్న చెరువులను మత్స్య శాఖకు బదిలీ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రజతోత్సవ సభకు వివిధ కుల సంఘాలు, ప్రజాసంఘాలు తమ మద్దతు తెలుపడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అంబర్ పేట పోత్గల్ గంగపుత్ర సంఘం ప్రతినిధులు పెంటం మల్లేశ్, పెంటం మల్లేశం, రాంచందర్, భిక్షపతి, లక్ష్మీపతి, రాజు, పాక రాజు, పరుశురాం, బాల్ రాజ్, సత్యనారాయణ, నర్సయ్య, పెంటం పరశురాం, సంతోష్, శంకర్, కిషన్ పాల్గొన్నారు.