ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆమెను వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శనివారం కలిసి తమ బడులలో నెలకొన్న సమస్యలను విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన కనీస వసతులను ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. శిథిలావస్థలో ఉన్న డెయిరీ క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాల విషయమై మారేడ్‌పల్లి ఎమ్మార్వోతో మాట్లాడి, గోకుల్‌నగర్‌లో స్థల ఏర్పాటుపై సర్వే నిర్వహించి నివేదికను త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, డిప్యూటీ ఈవో బాలునాయక్, డెయిరీ పాఠశాల ప్రిన్సిపాల్ పవన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న భవనం అర్ధాంతరంగా కూలిపోవడం ఘోరమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై శనివారం సంబంధిత జోనల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి మెరుగైన వైద్యం అందజేసి, వారిని ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.