ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ఓ వైపు అవినీతి తిమింగలాల వేట కొనసాగుతున్నా… మరోవైపు లంచాల భాగోతం మాత్రం ఆగడం లేదు. అవినీతి, లంచాలకు మరిగిన ఉద్యోగులపై ఏసీబీ వరుస దాడులు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా…కొందరు అధికారుల తీరులో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సాగించిన అక్రమాల పర్వం తాజాగా బయటపడటం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వ నిబంధనలు, నైతిక విలువలను పూర్తిగా గాలికొదిలేసి, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన ఒక సివిల్ కాంట్రాక్టర్ రక్తాన్ని పిండి చేసిన సొమ్మును సదరు ఇంజినీరు (ఏఈఈ/ప్రస్తుతం డీఈ ఎస్ఎన్డీపీ హోదా) తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. దాదాపు రూ.3.40 కోట్ల మేర ఆదాయాన్ని తన వైపు మళ్లించుకున్న తీరు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నది. దొంగ బ్యాంక్ ఖాతాలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ నయా దగాపై తాజాగా బాధితుడు, సివిల్ కాంట్రాక్టర్సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ భారీ సామ్ వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సివిల్ కాంట్రాక్టర్‌ను టార్గెట్‌గా చేసుకున్న సంబంధిత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) హోదాలో అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నిజాంపేట్ డంప్ యార్డ్ నుంచి జవహర్‌నగర్ డంప్ యార్డ్‌కు చెత్తను తరలించే (లిఫ్టింగ్) భారీ ప్రక్రియలో అనధికారిక భాగస్వామ్యం అయ్యాడు. స్వయంగా ఎంబీ రికార్డులు (బిల్లులు) చేసే అధికారం ఇంజనీర్‌దే కావడంతో విధిలేని పరిస్థితుల్లో జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున బినామీగా అనధికారికంగా రంగంలోకి దింపారు.
ఈ నేపథ్యంలోనే అధికారి ఒత్తిడికి తలొగ్గిన కాంట్రాక్టర్ ఆగస్టు 2023 నుంచి జనవరి 2025 వరకు అహోరాత్రులు కష్టపడి డంప్ యార్డ్ పనులను విజయవంతంగా పూర్తిచేశారు. ఇందుకోసం జేసీబీలు, ప్రొక్లెయిన్లు, టిప్పర్లు, లేబర్, డీజిల్ ఖర్చుల నిమిత్తం తన సొంత నిధులతో పాటు భారీగా అప్పులు తెచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం 11 ఫైళ్లకు గానూ 9 బిల్లులను నిబంధనల ప్రకారం అకౌంట్స్ సెక్షన్‌కు సమర్పించారు. ఇక్కడే ఏఈఈ చక్రం తిప్పాడు. కాంట్రాక్టర్‌కు రావాల్సిన ఆదాయాన్ని ఒక్కరికే దక్కాలన్న కుట్రకు తెరలేపాడు.
కాంట్రాక్టర్‌కు కనీస సమాచారం లేకుండానే జేఎంసీ కన్స్ట్రక్షన్స్ (ప్రొప్రైటరీషిప్ – నకిలీ సంస్థ) పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ జీఎస్టీ, పాన్‌కార్డ్‌లను సృష్టించి ఒక దొంగ బ్యాంక్ ఖాతాను తెరిచారు. బిల్లులు రికార్డులు చేయడం, డ్రా చేసుకోవడంలో తన అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు సదరు ఉద్యోగి.. పనిచేసిన కాంట్రాక్టర్‌కు మాత్రం విజిలెన్స్ క్లియరెన్స్ పేరుతో ఆయా బిల్లులను పెండింగ్ లో పెట్టారని చెబుతూ ఏడాది కాలం నెట్టుకువచ్చాడు. తీరా బాధిత కాంట్రాక్టర్ ఆరా తీయగా..నకిలీగా సృష్టించిన జేఎంసీ కన్స్ట్రక్షన్ పేరుతో బిల్లులన్నీ డ్రా అయినట్లు తేలడం, సదరు ఏఈఈ అసలు కుట్ర బయటపడటంతో కాంట్రాక్టర్ నిర్ఘాంతపోయాడు.
కుటుంబ సభ్యులంతా బినామీలే..!
ఈ భారీ దోపిడీలో సదరు ఏఈఈ తన కుటుంబ సభ్యులనే బినామీలుగా వాడుకొని వ్యవస్థను మేనేజ్ చేయడం గమనార్హం. సదరు నకిలీ జేఎంసీ కన్స్రక్షన్ (ప్రొప్రైటరీషిప్ – నకిలీ సంస్థ) సదరు ఇంజనీర్ సోదరి, ఆమె భర్త (కడప జిల్లా వాసులు)ను యజమానులుగా చూపెట్టారు. ఈ దొంగ ఖాతాకు ఇంజనీర్‌కు తండ్రి అధికారిక సంతకందారుడిగా నియమించి, మున్సిపాలిటీ నుంచి విడుదలైన చెకులను అక్రమంగా డ్రా చేసుకున్నారు. అసలు కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేతులు కలిపి, రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన సబ్-కాంట్రాక్టర్‌కు నయాపైసా దకకుండా నిధులన్నీ కొల్లగొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే బినామీ సంస్థను సృష్టించమే కాకుండా రూ.కోట్లాది రూపాయల బిల్లులను డ్రా చేయించుకోవడంలో పెద్ద ఎత్తున నిబంధనలకు తిలోదకాలిచ్చి ఖజానాకు భారీగా గండి కొట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది.
కమిషనర్‌ను ఆశ్రయించిన బాధిత కాంట్రాక్టర్..
ఈ అక్రమాలతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు ఎటువంటి సంబంధం లేదని, లోపమంతా సదరు ఇంజనీర్, ఆయన కుటుంబ సభ్యులదేనని బాధితుడు స్పష్టం చేశాడు. తప్పు డు మార్గాల్లో తనను ఆర్థికంగా దెబ్బతీసి, నడిరోడ్డుపై నిలబెట్టిన ఇంజనీర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. నకిలీ బ్యాంక్ ఖాతాలు, ఫోర్జరీ జీఎస్టీ రికార్డులను వెలికితీయాలని, క్షేత్రస్థాయిలో యంత్రాల వినియోగం, లేబర్ రికార్డుల ఆధారంగా తానే అసలైన ఎగ్జిక్యూటర్ అని తేల్చి, తనకు న్యాయం చేయాలని బాధితుడు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ భారీ నిధుల మళ్లింపు వ్యవహారంపై మున్సిపల్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.