Hyderabad | మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త హైదరాబాద్లో కలకలం సృష్టించింది. మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెబుతూ ఓ వీడియో వైరల్ కావడంతో నగర వాసులు భయాందోళనలతో వణికిపోయారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. అసలు విషయం బయటపెట్టారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపించింది చిరుత కాదని శంషాబాద్ డీఎఫ్వో విజయానందరావు తేల్చిచెప్పారు. అది అడవి పులి మాత్రమే అని నిర్ధారించారు. ఆ ప్రాంతాలను పరిశీలించినప్పుడు కాలి ముద్రలు 3.5 సెంటీమీటర్లు మాత్రమే ఉందని చెప్పారు. చిరుత పులి ముద్ర అయితే కనీసం 7 సెంటీమీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. సెల్ఫోన్లో జూమ్ చేసి వీడియో తీయడం వల్ల అది చిరుత పులిలాగా కనిపించిందని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అటవీ అధికారులు ఇచ్చిన క్లారిటీతో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
సాధారణంగా అడవి పిల్లి మన ఇంట్లో ఉండే పిల్లిలాగే ఉంటుంది. కానీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. చూడ్డానికి పిల్లిలాగే కనిపించినా దాని వ్యవహార శైలి చిరుతపులిలాగే ఉంటుంది. అందువల్లే దూరం నుంచి అడవి పిల్లిని చూసి చిరుత పులి అయ్యి ఉంటుందని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించారు. చివరకు అది అడవి పిల్లి అని తేల్చారు.