హైదరాబాద్ : ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ పోలీస్ సర్వీస్‌కు చెందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గొంగి రెడ్డి రాఘవ రెడ్డి(94) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవరెడ్డి పది రోజుల క్రితం.. ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రాఘవ రెడ్డి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 5:15 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవరెడ్డి మృతి పట్ల పలువురు పోలీసు అధికారులు సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
1928, జులై 5వ తేదీన వరంగల్ జిల్లాలోని పెంబర్తిలో రాఘవ రెడ్డి జన్మించారు. ఆయనకు ఆరేండ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో అనాథగా మారిన రాఘవరెడ్డిని రావి నారాయణ రెడ్డి చేరదీశారు. ప్రాథమిక విద్య వరంగల్‌లో కొనసాగింది. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాఘవ రెడ్డి.. రెడ్డి హాస్టల్లో ఉంటూ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. ఈవినింగ్ కాలేజీలో రెండేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. 1956లో హైదరాబాద్ పోలీసు సర్వీస్‌కు ఎంపికయ్యారు. 1957లో ఉమ్మడి ఏపీలో డీఎస్పీగా సేవలందించారు. రాఘవరెడ్డికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.