Andhra Pradesh News | పిల్లలు అబద్ధాలు చెప్పరు, వారికి దాచిపెట్టడం చేతకాదు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు నెల్లూరు జిల్లాకి చెందిన ఒక చిన్నారి. కార్డన్ సెర్చ్‌లో భాగంగా.. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఒక తండ్రి తన ద్విచక్ర వాహనాన్ని రహస్యంగా దాచిపెట్టగా.. అతడి కొడుకు మాత్రం అమాయకంగా అసలు నిజం చెప్పి పోలీసులను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందంటే!
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడ ఉన్న వాహనాల పత్రాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ స్థానికంగా ఉంటున్న సురేష్ అనే వ్యక్తి అతడి వద్ద ఉన్న బైక్‌కు సరైన ధ్రువపత్రాలు లేవని భయపడ్డాడు. పోలీసుల కంట పడితే జరిమానా పడుతుందనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా ఆ బండిని తీసుకెళ్లి పక్క వీధిలోని మరో ఇంట్లో అత్యంత రహస్యంగా దాచిపెట్టాడు.
అయితే పోలీసులు సురేష్ ఇంటికి వచ్చి వాహనాల గురించి ఆరా తీస్తుండగా, అక్కడే ఆడుకుంటున్న సురేష్ ఆరేళ్ల కొడుకు మహేంద్ర ఎంతో అమాయకంగా ముందుకు వచ్చాడు. మా నాన్నకు బైక్ ఉంది కానీ, మీరు వస్తున్నారని ముందే తెలిసి ఆ బండిని పక్క వీధిలోని ఇంట్లో దాచిపెట్టాడు అంటూ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. అంతేకాకుండా, ఆ చిన్నారి తన తండ్రి సీక్రెట్‌ను బయటపెట్టడమే కాకుండా, నేరుగా పోలీసులు చేయి పట్టుకుని బండి దాచిన చోటుకి తీసుకెళ్లి మరీ చూపించాడు.
ఇక బైక్‌ని పరిశీలించిన పోలీసులు వాహనానికి పొల్యుషన్ పత్రాలు లేవని ఫైన్ వేసినట్లు సమాచారం. మరోవైపు చిన్నారి అమాయకత్వాన్ని చూసి అక్కడున్న పోలీసులతో పాటు స్థానికులు కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు. పోలీసులు తండ్రి చేసిన చాతుర్యాన్ని గుర్తించి మందలించగా, కొడుకు చేసిన అమాయక పని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్‌గా మారింది.
“మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచిపెట్టాడు”
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కార్డన్ సెర్చ్ సందర్భంగా ఆసక్తికర ఘటన
వాహనాల తనిఖీలకు వచ్చిన పోలీసులకు తన తండ్రి బైక్ దాచిన ప్రదేశాన్ని చూపించిన ఆరేళ్ల బాలుడు
సరైన పత్రాలు లేవని బైక్‌ను పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచిన సురేష్
“మీరు… pic.twitter.com/rGtjritguC
— TNews Telugu (@TNewsTelugu) August 21, 2026