ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. ఎల్బీస్టేడియం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జోనల్ కార్యాలయ పరిధిలోని ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహకారంతో ఎల్బీస్టేడియం నుంచి మొదలుకుని ఎంజే మార్కెట్ వరకు ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను కూల్చివేశారు. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ..బాధితులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా ఫుట్‌పాత్ ఆక్రమణలను కూల్చివేయాలని నిర్ణయించి.. ఆ ప్రక్రియ చేపట్టినట్లు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సయ్యద్ సయీదుద్దీన్ తెలిపారు.
– అబిడ్స్