సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని హాలో కాక్టైల్ బార్ అండ్ కిచెన్‌పై ఆహార విభాగానికి సంబంధించిన టాస్క్‌ఫోర్స్ టీం దాడి చేసింది. బార్లో గోల్డెన్ రింగ్స్, కియోరా వాటర్, మలబార్ పరోటా, హభాఫ్ బేక్డ్, స్పైసీ బ్లాక్, బీన్ సాస్ వంటి ఆహార పదార్థాలు గడువు ముగిసినట్లు అధికారుల బృందం గుర్తించింది. వీటితో పాటు కార్న్‌ప్లోర్, అమెరికన్ గార్డెన్ యాపిల్ సిడార్, వెనిగర్, బ్లాక్ పెప్పర్, టీ పౌడర్ ప్యాకెట్లకు సరైన లేబుల్స్ లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన చాలా వరకు సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఆర్టికల్స్ గడువు ముగిసిందని గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. శాకాహారం, మాంసాహార ఆహార పదార్థాలు కలిపి నిల్వ చేశారని గుర్తించి, సంబంధిత హాలో కాక్టైల్ బార్ అండ్ కిచెన్ నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.