ఆన్లైన్లో ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు ఆర్డర్ చేస్తున్నారా..? అయితే.. మీరు అలా కొనుగోలు చేసినవి నాణ్యమైనవి, శుభ్రమైనవి, స్వచ్ఛమైనవి కాకపోవచ్చు… క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల్లోనే మీ ఇంటి ముందుకు తీసుకొచ్చే సరుకులు స్వచ్ఛమైనవి కాకపోయే ప్రమాదం ఉంది. ఆఫర్లు, తక్కువ ధరలు, క్షణాల్లో ఇంటికే సరకులు వస్తున్నాయని మీరు కొనుగోలు చేసేవి నాణ్యమైనవి కాకపోవచ్చు. మీకు నిమిషాల్లోనే ఇంటికి తీసుకొచ్చే ‘జెప్టో’ సంస్థ కుళ్లిపోయి బూజు పట్టిన కూరగాయలు, గడువుతీరిన నిత్యావసరాలు, పురుగులు పట్టిన సరకులను సరఫరా చేస్తున్నది.
అవును.. ముంబయిలోని ధారావి ప్రాంతంలో ఉన్న జెప్టో గోడౌన్లో ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో జెప్టో బండారం బట్టబయలైంది. అధికారుల తనిఖీల్లో గోడౌన్ పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. ఫ్లోర్ మొత్తం మురికిగా కుళ్లిపోయిన కూరగాయల కుప్పలు దర్శనమిచ్చాయి. వినియోగదారులకు సరఫరా చేసే కూరగాయలు బూజుపట్టి ఉన్నాయి. గోడౌన్లో సరఫరాకు సిద్ధంగా ఉన్న పప్పు, పిండితో సహా నిత్యావసర వస్తువులు గడువుతీరిపోయి ఉన్నవి.
ఎఫ్ఏడీ అధికారుల్లో తనిఖీ వెలుగు చూసిన జెప్టో బాగోతాన్ని ఓ ప్రముఖ నేషనల్ మీడియా కథనం ప్రచురించింది. నిబంధనలకు విరుద్ధంగా, కల్తీ ఆహార పదార్థాలను ప్రజలకు సరఫరా చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న జెప్టో సంస్థ లైసెన్స్‌ను ఎఫ్‌డీఏ అధికారులు సస్పెండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా క్విక్ కామర్స్ సంస్థలు, యాప్‌లు సరఫరా చేస్తున్న కూరగాయలు, ఆహార పదార్థాలు నాణ్యత లోపించి ఉంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు, తక్కువ సమయంలో ఇంటికే వస్తున్నాయని యాప్‌లను ఆశ్రయించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
క్విక్ కామర్స్ సంస్థ జెప్టో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూరగాయలు, పాలు, పండ్లు, నిత్యావసరాలను ఆన్లైన్లో సరఫరా చేస్తున్నది. ఈ సంస్థకు అన్ని నగరాల్లో గోడౌన్లు ఉన్నాయి. అయితే.. నిమిషాల్లోనే వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో టన్నుల కొద్ది సరకులను స్టోర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజులు తరబడి నిల్వ ఉండటంతో కూరగాయలు కుళ్లిపోతున్నాయి. సరకుల నిర్ణీత గడువు తీరిపోతున్నది. అయినా వాటినే వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారుల తనిఖీల్లో వెళ్లడైంది. ఎఫ్‌డీఏ నిబంధనలు ఏ మాత్రం పాటించడంలేదని అధికారులు తేల్చారు.
గోడౌన్ పరిసరాలు కూడా మురుగుతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నట్లు అధికారులు చెప్పారు. కుళ్లిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జెప్టో సంస్థకు అధికారులు నోటీసులు సైతం జారీ చేశారు. తమకు ఏ సంస్థను కించపరిచే ఉద్దేశం లేదని, ప్రజలకు హాని కలిగించే ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నందుకే జెప్టోపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. అన్ని జెప్టో గోడౌన్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.