Pani Puri | సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే పానీపూరి ఇప్పుడు విషపూరితంగా మారింది. వ్యాపారమే లక్ష్యంగా, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి హానికరమైన మసాల దినుసులు, ఫుడ్ కలర్‌ను కలిపి వినియోగదారులకు అందిస్తున్నారు. తాజాగా పుడ్ సేఫ్టీ అధికారులు బేగంపేట్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఓ చాట్‌బండార్‌లో నిషేధిత, హానికరమైన మసాలా, రంగులను గుర్తించారు. వీటిని పానీపూరిలో కలిపి జనాలకు వడ్డిస్తున్నారు. బేగంబజార్‌లోని శ్యామ్సింగ్ చాట్ బండార్‌లో.. ఫుడ్ సేఫ్టీ అధికారుల టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోపాటు, పరిమితికి మించి విక్రయాలు జరుగుతున్నాయని, మసాలా చాట్, పానీపూరికి వినియోగించే పదార్థాలన్నీ కూడా గడువు తీరినవేనని తేల్చారు. ఇక ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పెరుగు, నూడిల్స్ కలుషితమైనట్లుగా వెల్లడించారు. ఇక చాట్ బండార్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుకలు… వినియోగదారులకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయని, కలుషితమైన పరిసరాలతో ఉండే చాట్ బండార్ రుచికరమైన పానీపూరీలు దేవుడెరుగు కానీ, అనారోగ్య సమస్యలను అదనంగా వడ్డిస్తున్నట్లు ఉన్నాయి. ఇకనైనా సిటీ జనాలు బజారులో దొరికే ఛాట్ బండార్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి ఆకలి తీర్చుకోవడం కంటే ఇంట్లోనే రుచి, శుచిగా ఉండే ఆహారాలను తయారు చేసుకోవడం ఉత్తమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.