సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : జిహ్వ చాపల్యాన్ని తట్టుకోలేక రెస్టారెంట్‌కు వెళ్లి తిందామనుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త. రుచికి పేరు మోసిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి ఫుట్‌పాత్‌లపై ఉన్న టిఫిన్ బండ్ల వరకు.. నాసిరకం సరుకులు వాడుతున్నారు. పాచిపోయిన ఫుడ్డే పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ బృందాల తనిఖీల్లో ప్రతిరోజూ వెల్లడవుతున్న కఠోర వాస్తవాలివి. ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు వేళ్లమీద లెక్కపెట్టేంత తక్కువ సంఖ్యలో ఉన్నాయి. నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంటగదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు.
వంట చేసే క్రమంలో కల్తీ సరుకులో లేక నాసిరకమో వాడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో అయితే.. కస్టమర్ అడగగానే పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మసాలాలు దట్టించి వాడుతున్నారు. కొన్ని సార్లు బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. తరచుగా జీహెచ్ఎంసీకి నిత్యం దాదాపు 20 వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి.
ఇందులో భాగంగానే గడిచిన కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై విస్తృత తనిఖీల్లో ఆహార కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతున్నదని, ఏ మాత్రం శుభ్రత, నాణ్యత లేదన్న విషయం వెల్లడవుతున్నది. గడిచిన ఏడాది కాలంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు 1887 నమూనాలను సేకరించింది. వీటిలో 95 నమూనాలు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఆహార ఉత్పత్తుల కల్తీకి పాల్పడిన సంబందిత వ్యాపారస్తులపై అధికారులు రూ. 30.60 లక్షల జరిమానా విధించారు.
అంతేకాకుండా 12 కేసులలో కల్తీ ఉత్పత్తులు మానవ వినియోగానికి సురక్షితం కాదని తేలడంతో సంబంధిత వ్యాపారస్తులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రైవేట్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వీటితో పాటు పలు హాస్టళ్లలో నమూనాలను సేకరించింది. అశోక్‌నగర్, దిల్సుఖ్నగర, అమీర్‌పేట, ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో 117 హాస్టళ్లలో తనిఖీలు చేయగా 74 హాస్టల్ యాజమానులను నోటీసులు జారీ చేశారు. 12 హాస్టళ్ల కిచెన్లను మూసివేశారు. 1955 చట్టం ప్రకారం రూ. 5.9 లక్షల జరిమానా విధించారు.
కోటికి పైగా జనాభా కలిగిన నగరంలో దాదాపు 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంటనూనె నుంచి మొదలుకొని ఉప్పు దాకా నాణ్యమైన సరుకును వినియోగించి నిర్వాహకులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మాంసాహారం వండేటప్పుడు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ధ్రువీకరించి స్టాంప్ వేసిన మాంసాన్నే వాడాలి. హోటళ్లు, హాస్టల్స్, క్యాంటీన్లు, బార్ అండ్ రెస్టారెంట్లు,చైనీస్ ఫుడ్ సెంటర్లు..ఫుడ్ వ్యాపారం ఏదైనా నిర్వాహకులు వంటగది లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజి వసతి బాగుండాలి.
వంట వండే వ్యక్తి, వడ్డించే వ్యక్తులకు సంబంధిత హోటల్ యాజమాని వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చాలా చోట్ల ఆమలు కావడం లేదు. పెద్ద హోటళ్ల నుంచి ఫుట్‌పాత్‌పై టిఫిన్ సెంటర్ల వరకు చాలావరకు నాసిరకం సరుకులు, కూరగాయాలు వాడుతున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మాంసం కూడా రోజులకు రోజులు డీఫ్రిజ్‌లో ఉంచి వాటిని గడువు మీరినా వండుతున్నారు. తనిఖీల్లో ఈ విషయాలు బహిర్గతం కావడం అధికారులను కూడా కొంత విస్మయపరిచింది.